అది సిక్స్ ప్యాక్ కాదు, లిక్కర్ ప్యాక్

  • Publish Date - September 1, 2020 / 12:50 PM IST

మద్యం అక్రమ రవాణాకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. వారి ఐడియాలు చూసి పోలీసులు విస్తుపోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణ చేయడం బాగా పెరిగింది. అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు కేటుగాళ్లు కొత్త కొత్త పద్దతులు ఆశ్రయిస్తున్నారు. పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు.



చొక్కాలు విప్పి చూసి షాక్ తిన్న పోలీసులు:
తాజాగా కృష్ణా జిల్లా తిరువూరులో అలాంటి ఘటనే జరిగింది. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యాన్ని వారు తరలిస్తున్న తీరు తెలుసుకుని పోలీసులు విస్మయం చెందారు. ఇద్దరు వ్యక్తులు టూవీలర్ పై వెళ్తున్నారు. పోలీసులకు ఎందుకో వారి మీద అనుమానం వచ్చింది. వెంటనే వారిని ఆపారు. వారిని తనిఖీ చేశారు. వారి బాడీలు చూస్తే సిక్స్ ప్యాక్ లాగా అనిపించాయి. కానీ వారి ముఖాలు చూస్తే ఎక్కడో సందేహం కొట్టింది. అంతే, వారి చొక్కాలు విప్పి చూసి కంగుతిన్నారు. ఆ వ్యక్తులు ప్లాస్టర్ సాయంతో తమ బాడీపై మద్యం బాటిళ్లు అంటించుకున్నారు.

చొక్కా లోపల 101 మద్యం బాటిళ్లు:
అది సిక్స్ ప్యాక్ కాదు లిక్కర్ ప్యాక్ అని తెలుసుకుని పోలీసులు కంగుతిన్నారు. ఆ ఇద్దరి నుంచి 101 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు ఈ పని చేశారని పోలీసులు తెలిపారు.



జోరుగా మద్యం అక్రమ రవాణ:
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మద్యం షాపుల సంఖ్య భారీగా తగ్గించింది. ఆ తర్వాత మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో కేటుగాళ్లు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి ఏపీలో విక్రయించడం షురూ చేశారు. తెలంగాణ నుంచి ఏపీలోకి పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం రవాణ అవుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం, మద్యం అక్రమ రవాణను అడ్డుకునేందుకు ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసింది. 13 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక బృందాలను, అధికారులను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు విసృత్తంగా తనిఖీలు చేస్తున్నా, మద్యం అక్రమ రవాణకు అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణతో పాటు కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణ అవుతోంది.

బ్రాండెడ్ లిక్కర్ కోసం పాట్లు:
ఏపీలో బ్రాండ్ లిక్కర్ ఏదీ దొరకడం లేదు. అన్నీ లోకల్ బ్రాండ్ వే విక్రయిస్తున్నారు. అయితే బ్రాండ్ లిక్కర్ కు అలవాటు పడ్డ మందుబాబులు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తెప్పించుకుంటున్నారు. మందుబాబుల వీక్ నెస్ ను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఏపీలో విక్రయిస్తున్నారు.