దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడుతూ.. ‘నా బిడ్డకు న్యాయం జరిగింది. కోర్టు ఆదేశాలతో (డెత్ వారెంట్) మహిళల చట్టాల్లో తిరిగి విశ్వాసాన్ని నింపిందని ఆమె తెలిపారు. నిర్భయ నిందితులు నలుగురికి ఉరిశిక్ష విధించడం ద్వారా దేశంలోని మహిళలను శక్తివంతం చేసింది.
ఈ నిర్ణయంతో న్యాయ వ్యవస్థలో మరింత విశ్వాసాన్ని బలోపేతం చేసిందని ఆశా దేవి అన్నారు. ‘ ఈ రోజు నాకు బిడ్డకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఏడు సంవత్సరాలు పట్టింది. న్యాయం కోసం ఆమె పోరాటం ఇన్నాళ్లకు ముగిసింది. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని బలపరచనుంది. నా కుమార్తెకు న్యాయం జరుగుతుందని నాకు తెలుసు. ఇప్పటివరకూ ఆలస్యమవుతూ వచ్చింది. కానీ, చివరికి డెత్ వారెంట్ జారీ అయింది.
ఇప్పుడు దేశ కుమార్తెలకు న్యాయం జరిగింది’ అని ఆశా దేవి మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా, నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ మాట్లాడుతూ.. కోర్టు నిర్ణయంతో తనకు సంతోషంగా ఉందని అన్నారు. నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులు నలుగురికి ఎట్టకేలకు ఉరిశిక్ష విధించే తేదీని ఖరారు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ఢిల్లీ కోర్టు తీర్పును రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వాగతించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి ఇదో పెద్ద గుణపాఠమని ఆయన అన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిందరికి ఇదొక గుణపాఠంగా అవుతుందని చెప్పారు. ఈ వార్త కోసం ఎన్నాళ్లుగా నిర్భయ తల్లిదండ్రులతో పాటు యావత్తూ దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, చివరిగా న్యాయమే గెలిచిందని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిర్భయ నలుగురు దోషులకు జనవరి 22 ఉదయం 7గంటలకు ఉరి తీయాలని కోర్టు తీర్పు వెలువరించింది.