Rayaparthy SBI Bank Robbery Case : వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. చోరీకి పాల్పడిన ఏడుగురు నిందితుల్లో.. ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ చోరీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. పరారీలో మరో నలుగురు నిందితులు ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని వరంగల్ సీపీ తెలిపారు. నిందితుల నుంచి 2 కిలోలకుపైగా బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. గత నెల 18న రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది.
”గత నెల 18వ తేదీన రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో దొంగతనం జరిగింది. ఈ చోరీలో 19 కిలోల బంగారు ఆభరణాలను దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. దొంగతనం గురించి సమాచారం తెలిసిన వెంటనే ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశాం. వారి హార్డ్ వర్క్ తో చోరీ కేసును చేధించారు. దొంగల ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేశాం. మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. యూపీ, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. చోరీకి వాడిన వాహనం దొరికింది. ఆ వాహనం ఆధారంగానే కేసుని ఛేదించాం.
దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశాం. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నాం. బ్యాంకులు ప్రైవేట్ సెక్యూరిటీ లేదు. దొంగలు రెక్కీ చేశారు. గార్డులు లేని బ్యాంకులను వారు టార్గెట్ చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశాం. సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పాము. అన్ని బ్యాంకులు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. క్యాష్, గోల్డ్ స్టోరేజ్ ఉన్న బ్యాంకుల్లో తప్పకుండా సెక్యూరిటీ పెంచుకోవాలి. రెగులర్ గా రివ్యూ చేయాలి. బ్యాంకులు కొత్త అలారం సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవాలి. కొత్త సిస్టమ్ లో మెయిల్ అలారమ్ కట్ చేసినా.. బ్యాంకు మేనేజర్ కి, పోలీసులకు ఎస్ఎంఎస్ వెళ్తుంది. సిస్టమ్స్ ఇంప్రూవ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ కేసులో అనాలసిస్ ద్వారా తెలిసింది” అని వరంగల్ సీపీ తెలిపారు.
Also Read : హైదరాబాద్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బైకులు