Police Marriage
police attend accused persons marriage gangavathi karnataka: అదేంటి.. పోలీసు అధికారులు పెళ్లికి వెళ్లకూడదా? విందు ఆరగించకూడదా? అలా చేస్తే తప్పా? అనే సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. నిజమే.. పోలీసు అధికారులు ఏదైనా పెళ్లికి వెళ్లొచ్చు, విందు కూడా ఆరగించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ పోలీసులు వెళ్లింది ఓ నిందితుడి పెళ్లికి. అందుకే అడ్డంగా బుక్కయ్యారు.
కర్నాటక రాష్ట్రంలోని గంగావతి పోలీసు అధికారులు ఓ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి ఇంట జరిగిన పెళ్లికి వెళ్లారు. దీంతో వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పలేదు. కనకగిరి తాలూకా హులిహైదర్ గ్రామానికి చెందిన హనుమంతేష్ నాయక్ కొడుకు ఆనంద్ పెళ్లికి గంగావతి డీవైఎస్పీ రుద్రష్ ఉజ్జినకొప్ప, రూరల్ సీఐ ఉదయ్‌రవి, కనకగిరి పీఎస్‌ఐ తారబాయ్‌లు డ్యూటీ డ్రెస్ లోనే హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించి పూలదండలు వేయించుకుని సన్మానమూ అందుకున్నారు. విందు కూడా స్వీకరించారు. అసలే అతడు నిందితుడు. పైగా పోలీసులు డ్యూటీ డ్రెస్ లో వెళ్లారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. నిందితుడి పెళ్లికి వెళ్లడాన్ని వారు సీరియస్ గా తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ ఐజీ, డీజీపీలు వారిపై కన్నెర్ర చేశారు. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని మండిపడ్డారు. తక్షణం సెలవు పెట్టి వెళ్లాలని ఆ ముగ్గురుని ఆదేశించారు.