Srushti Fertility Center: హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ క్లినిక్ కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత అసలు సరోగసీ చేయలేదన్నారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేశారని.. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారని చెప్పారు. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీకి చెందిన మహిళకు రూ.90 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. సరోగసీ కోసం దంపతుల దగ్గర డాక్టర్ నమ్రత మొత్తం రూ.40 లక్షలు వసూలు చేసిందని పోలీసులు వెల్లడించారు. అసలు ఇది సరోగసీ కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసులు.
నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై రైడ్ చేశాం. గోపాలపురంలో ఓ జంట ఇచ్చిన కేసుపై దర్యాప్తు చేశాం. ఆన్ లైన్ లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి తెలుసుకుని ఓ జంట అప్రోచ్ అయ్యారు. సరోగసీ పద్ధతిలో పిల్లలు పుట్టించేందుకు 30 లక్షలు అవుతాయని డాక్టర్ నమ్రత చెప్పారు. విజయవాడ వెళ్ళి అక్కడ శాంపిల్ ఇచ్చారు. సరోగసీ కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని ఆ జంటకి చెప్పిందిడాక్టర్ నమ్రత. సిజేరియన్ ద్వారా డెలివరీ అయ్యిందని.. మరో 10 లక్షలు అదనంగా అయ్యిందని చెప్పింది. దంపతులు ఈ డబ్బు కూడా ఇచ్చారు.
కొన్ని నెలల తర్వాత బాబు పోలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. DNA టెస్ట్ చేయాలని దంపతులు అడిగారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించింది. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి DNA గా తేలింది. దంపతులు నమ్రతను నిలదీశారు. దంపతులపై నమ్రత బెదిరింపులకు పాల్పడింది. డాక్టర్ నమ్రత కొడుకు జయంత్ అడ్వకేట్. ఎవరైనా బాధితులు వస్తే కోర్టులు, కేసుల పేరుతో ఉల్టా బెదిరించేది.
వేరే మహిళకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసీ ద్వారా మీకు పుట్టిన బిడ్డ అని నమ్మించారు. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణిని ఫ్లైట్ లో వైజాగ్ తీసుకొచ్చారు. అక్కడ డెలివరీ చేశారు. ఈమె కి పుట్టిన బిడ్డను వాళ్లకు ఇచ్చారు. బిడ్డను ఇచ్చినందుకు 90 వేలు ఇచ్చారు. డాక్టర్ నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు ఉన్నాయి. IVF ఫెయిల్యూర్, సరోగసీలో అక్రమాలు వంటి కేసులు నమ్రతపై ఉన్నాయి.
సృష్టి బేబీ సెంటర్ అనుమతులు ఎప్పుడో క్లోజ్ అయ్యాయి- DMHO వెంకటి
సృష్టి సెంటర్ పై రైడ్ లో మేము కూడా పాల్గొన్నాం. 2020 లోనే వాళ్ళ అనుమతులు క్లోజ్ అయ్యాయి. మేము హాస్పిటల్ మూసేస్తున్నాం అని చెప్పారు. వాళ్లకి క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాం. కానీ.. అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారు. సెంటర్ లో థియేటర్ గుర్తించాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ ఎక్స్ పైరీ అయినా అక్రమంగా హాస్పిటల్ నడుపుతోంది.. అనస్థీషియా ల్యాబ్ ఉంది.. బెడ్స్ ఉన్నాయి.. 7 రకాల అనాలసిస్ చేసే ఎక్విప్ మెంట్ ఉంది. డస్ట్ బిన్ చెక్ చేస్తే.. రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించాం.