సరోగసి ముసుగులో ‘సృష్టి’ దారుణాలు.. ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు.. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతోపాటు పలువురు అరెస్ట్..

సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది.

సరోగసి ముసుగులో ‘సృష్టి’ దారుణాలు.. ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు.. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతోపాటు పలువురు అరెస్ట్..

Updated On : July 27, 2025 / 1:05 PM IST

Srushti Test Tube Baby Center: సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది. సికింద్రాబాద్ లోనే కాదు.. విశాఖపట్టణ, విజయవాడలో సృష్టి అక్రమాలు కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూస్తోంది. దీంతో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతోపాటు ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఒక చిన్నారికి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులకు కలిగిన అనుమానం సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహాకం పేరుతో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. పుట్టిన బిడ్డ తమ వీర్య కణాలతోనే కలిగిందా లేదా అనే అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేయించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాధిత దంపతుల ఫిర్యాదుతో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్‌ నమ్రత, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: Test Tube Baby Centre: దారుణం.. భర్త వీర్యంతో కాకుండా మరొకరి వీర్యంతో సంతానం.. క్యాన్సర్‌తో బయటపడ్డ టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసం..

సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఈనెల 25న గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సోనియా దంపతులు ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతాను కలిశారు. తమకు సంతానం కావాలని, ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా సంతానం కలిగేలా చేయాలని కోరారు. దీంతో డాక్టర్ నమ్రతా ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం వారి నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేసింది. దీంతో 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో, మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా దంపతులు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రొసీజర్ లో భాగంగా విశాఖపట్టణంలో మరో బ్రాంచ్‌కు శాంపిల్ కలెక్షన్ కోసం ఆ దంపతులను పంపించారు. కేవలం మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుసార్లు విశాఖ సెంటర్‌కు పంపించినట్లు బాధితులు పేర్కొన్నారు.

విశాఖలోని సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా గతంలో అనేక దారుణాలకు నిర్వాహకులు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద మహిళలను టార్గెట్ చేసి అద్దె గర్భంతో ఆస్పత్రి నిర్వాహకురాలు లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఆస్పత్రిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

విజయవాడలోనూ బెంజ్ సర్కిల్ సమీపంలో యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. 2015 నుంచి వీరి దందా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ ఆస్పత్రిపై రెండు సార్లు పోలీసు కేసులు నమోదయ్యాయి. పలు సందర్భాల్లో లైసెన్సు‌నుసైతం రద్దు చేశారు. ఆ తరువాత, వేరేవారి పేరుపై ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. డాక్టర్ కరుణ పేరుపై ఈ సెంటర్ నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెకోసం గాలిస్తున్నారు. సంతానం లేమి దంపతులకు సరోగసీ ద్వారా తక్కు ధరకే సంతాన ప్రాప్తి కల్పిస్తామని కృష్ణా, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రతా గతంలో స్వయంగా ప్రచారం చేసినట్లు చెబుతున్నారు.