పబ్జి గేమ్ వ్యసనం : దొంగగా మారిన 12 ఏళ్ల బాలుడు 

  • Publish Date - March 3, 2020 / 09:35 PM IST

పబ్జి మొబైల్ గేమ్ వ్యసనం ఒక పిల్లాడిని దొంగగా మార్చింది.  తన స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన గుజరాత్ కు చెందిన 12 ఏళ్ళ పిల్లవాడు తన స్నేహితులతో ఆటలో ఓడిపోవటంతో వారికివ్వటంకోసం 3 లక్షల రూపాయలను ఇంటి నుంచి దొంగతనం చేశాడు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. కిరాణా వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారస్తుడు తన ఇంటి బీరువాలోంచి గత కొద్దిరోజులుగా డబ్బులు మాయం అవటం గమనించాడు. కానీ ఎవరిని అనుమానించాలో అర్ధం కాలేదు.

ఒక రోజు బీరువాలో రాత్రి పూట చేతి గడియారం ఉంచాడు. ఆరోజు రాత్రి డబ్బుకోసం గదిలోకి వచ్చిన కొడుకు దొంగతనం చేస్తుండగా తల్లి తండ్రులు పట్టుకున్నారు. గతంలో పోయిన డబ్బు గురించి పశ్నించగా తానే తీసినట్లు నేరం ఒప్పుకున్నాడు. తన స్నేహితులతో ఆడుతున్న PUBG MOBILE GAME లో ఓడిపోవటంతో వారికిచ్చినట్లు తెలిపాడు. వయస్సులో ఉన్న పిల్లవాడు క్రమశిక్షణ తప్పాడని భావించిన తల్లితండ్రులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. తమపిల్లవాడి చుట్టుపక్కల ఉన్నస్నేహితులు అంతా పబ్జి గేమ్ కు బానిస అయినట్లు గుర్తించారు.

పిల్లవాడు ఇంట్లో దొంగిలించి ఇచ్చిన డబ్బులతో అతని స్నేహితులు ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనుకున్నారు.  కానీ వారి తల్లి తండ్రులు పిల్లల చేతుల్లోకి ఖరీదైన మొబైల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయని  ప్రశ్నించక పోవటంతో ఆశ్చర్యపోవటం పోలీసుల వంతైంది. వారందరూ మైనర్లే కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందింతులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.