Poppy Straw : హెరాయిన్ @ మేడిన్ హైదరాబాద్ ?

హైదరాబాద్‌లో  హెరాయిన్ తయారు చేస్తున్నారా... ? అనే అనుమానం పోలీసులలో కలుగుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న డ్రగ్స్ డిమాండ్ కు తగ్గట్టు,  డ్రగ్స్ మాఫియా అక్రమార్జనపై దృష్టి సారించి

Poppy Straw

Poppy Straw :  హైదరాబాద్‌లో  హెరాయిన్ తయారు చేస్తున్నారా… ? అనే అనుమానం పోలీసులలో కలుగుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న డ్రగ్స్ డిమాండ్ కు తగ్గట్టు,  డ్రగ్స్ మాఫియా అక్రమార్జనపై దృష్టి సారించి ఇందుకోసం మూత పడిన ఫార్మా కంపెనీలకు స్ధావరంగా చేసుకుని హెరాయిన్ తయారు చేస్తోందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఎందుకంటే హెరాయిన్‌ను తయారు చేసేందుకు అవసరమైన ముడిపదార్థం ‘పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌’ ను తరలిస్తున్న ఇద్దరు పంజాబీలను ఇటీవల రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.  విచారణలో స్ధానిక  కస్టమర్లకు  పాపిస్ట్రానే విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు.  ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరికి అమ్ముతున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఏడాది క్రితం మహేశ్వరంలో పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్   మొక్కలను పెంచుతున్నపలువురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్లీ ఇప్పుడు పంజాబ్ నుంచి పాపిస్ట్రా కాన్సన్ ట్రేట్ తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయటంతో పోలీసులలో అనుమానం మరింత బలపడింది.  పాపి స్ట్రా కాన్సన్ ట్రేట్ పట్టుబడటం ఇదే తొలిసారి కాగా….పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రంజిత్ సింగ్‌ను పట్టుకుంటేనే   విలువైన సమాచారం దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు.

మేడ్చల్ లోని   కండ్లకొయ టోల్ ప్లాజా వద్ద దాబా నిర్వహిస్తున్న ఇద్దరు పంజాబీలు  జగ్తార్ సింగ్, జైమాల్ సింగ్ లనుంచి రూ.15 లక్షలు విలువ చేసే  పాపి స్ట్రా కాన్సన్ ట్రేట్   ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల సెల్ ఫోన్ల లోని కాంటాక్ట్ నెంబర్లు ద్వారా పాపి స్ట్రా కాన్సన్ ట్రేట్  వీరు ఎవరెవరికి విక్రయించారు అని పోలీసులు లిస్టు తయారు చేస్తున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలలో ఎవరెవరు ఉన్నారు. ఎవరితో వీరు కాంటాక్ట్ లో ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
Also Read : Police raid : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ పై పోలీసుల దాడులు.. అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్
పంజాబ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో  పాపి స్ట్రా  మొక్కల పెంపకానికి కేంద్రం లైసెన్స్ ఇచ్చిందని…. అయితే దీన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పర్యవేక్షణలో పెంచాలని ఒక పోలీసు అధికారి తెలిపారు. కాపుకొచ్చాక మొక్కలోని ఓపియం, ఇతరత్రా  భాగాలను మందుల తయారీలో వినియోగిస్తారు. అయితే ముడి పాపి స్ట్రా కాన్సన్ ట్రేట్ కు కొన్ని రకాల రసాయనాలను కలిపితే అది ముందు మార్ఫిన్ గాను, ఆతర్వాత మరికొన్ని మందులు కలిపితే హెరాయిున్ తయారవుతుందని పోలీసులు తెలిపారు.

దీనిని బహిరంగ మార్కెట్ లో గ్రాముకు రూ. 9-10 వేలకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో మూత పడిన ఫార్మాకంపెనీల్లో పాపి స్ట్రా కాన్సన్ ట్రేట్,  ఓపియం ఉపయోగించి మాదక ద్రవ్యాలు ఏమైనా తయారుచేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కాగా… ఇతర మాదక ద్రవ్యాలతో పోలిస్తే పాపిస్ట్రా లో మత్తు గాఢత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.