ఏపీలో రెచ్చిపోయిన దొంగలు.. వేర్వేరు ప్రాంతాల్లో భారీ చోరీలు, పెద్ద మొత్తంలో నగదు నగలు అపహరణ

ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.

Robberies In AP (Photo Credit : Google)

Robberies In AP : ఏపీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లకు వేసిన తాళాలు పగలకొట్టి పెద్ద మొత్తంలో నగదు, నగలు అపహరించుకుపోయారు. ఎవరూ లేని సమయం చూసుకుని ఇళ్లలోకి చొరబడి సర్వం దోచేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో భారీ చోరీ జరిగింది. రాధిక థియేటర్ సమీపంలోని యామిని మెడికల్ స్టోర్ యజమాని మధుసూదన్ ఇంట్లో దొంగలు పడ్డారు. 11 లక్షల రూపాయల నగదు, కిలో వెండి, నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా దొంగలను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు.

మాజీ పోలీస్ ఇంటికే కన్నం..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోనూ మరో భారీ చోరీ జరిగింది. ఏకంగా మాజీ పోలీస్ ఇంటికే కన్నం వేశారు దొంగలు. దశరథ రామయ్య కాలనీలో రిటైర్డ్ డీఎస్పీ గిరిధర్ ఇంట్లో భారీ చోరి జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో పరిశీలించారు.

రూ.20లక్షల విలువైన బంగారం చోరీ..
అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు జేఆర్ పేటలో ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. పద్మ శేఖర్ రెడ్డి, సుభాషిని దంపతులు పని మీద నెల్లూరుకి వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంటికి కన్నం వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ.10లక్షల విలువైన ఆభరణాలు అపహరణ
ఇక, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి ఓ ఇంటిలో చోరీ జరిగింది. ప్రైవేట్ క్లాస్ నుండి పిల్లలను తీసుకొచ్చేందుకు ఓ మహిళ ఇంటి తలుపు వేసి బయటకు వెళ్లింది. అంతే, తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది.

ఇంటికి తాళం వేస్తే చాలు దొంగతనాలే..
ఇంటికి తాళం వేస్తే చాలు దొంగలు పడిపోతున్నారు. ఇంట్లో ఉన్న నగలు, నగదు సర్వం దోచుకెళ్తున్నారు. దొంగతనాలు జరక్కుండా పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వచ్చే లోపు దొంగలు పడిపోతున్నారని వాపోతున్నారు. చోరీలకు అడ్డుకట్ట వేసేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

Also Read : బెంగళూరులో షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..

ట్రెండింగ్ వార్తలు