Robbery attempt at Muttoot Finance in Jharkhand..
Robbery attempt at Muttoot Finance in Jharkhand.. : ఝార్ఖండ్ లోని ధన్‌బాగ్‌లో పట్టపగలు పోలీసులు ఓ దొంగను కాల్చి చంపారు. ఉదయం 10గంటల ప్రాంతంలో ధన్‌బాగ్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులోకి ఆరుగురు దొంగలు దూసుకొచ్చారు. సిబ్బందిని బెదిరించి దోపిడీకి యత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.పోలీసులను చూసిన దొంగలు పారిపోవటానికి యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ దొంగ చనిపోయాడు. మరో ఇద్దరు దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఓ పక్క పోలీసులు..మరోపక్క దొంగలు..పోలీసులు కాల్పులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. ఈ కాల్పుల్లో ఓ దొంగ మృతి చెందగా ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో ముగ్గురు దొంగలు పారిపోయారు. దాదాపు గంటపాటు పోలీసులు దొంగలను పట్టుకోవటానికి యత్నించటంలో భాగంగా ధన్‌బాగ్ ప్రాంతం అంతా తీవ్ర కలకలం రేగింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడున్నవారంతా తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. పోలీసుల కాల్పులతో భయాందోళనలకు గురి అయి ఏం జరుగుతుందో తెలియక అటు ఇటూ పరుగులు పెట్టారు.
ఎస్కేప్ అయిన దొంగలను పట్టుకోవటానికి పోలీసులు స్థానికంగా ఉన్న షాపులను మూయించివేసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దొంగల ముఠా బీహార్ కు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. దొంగలను పట్టుకోవటానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముత్తూట్ ఫైనాన్స్ కు చెందిన మేనేజ్ విక్రమ్ రాజు కూడా గాయపడ్డారు. కాగా దోపిడీకి యత్నించిన ఈ ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసు పోలీస్ స్టేషన్ కు కేవలం 150 మీటర్ల దూరంలో ఉంది. అయినా దొంగలు ఏమాత్రం భయపడకుండా దోపిడీకి యత్నించటం పట్ల వారు దోపిడీల్లో బాగా అనుభవం ఉన్నవారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దోపడి గత రెండురోజుల్లో జార్ఖండ్ లో జరిగిన రెండో అతిపెద్ద దోపిడీ అని పోలీసులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం గుంజన్ నగల షాపులో కోటి రూపాయల విలువైన నగలను దోపిడీగాళ్లు దోచుకుపోయారు. ఈ దోపిడికి పాల్పడివారే ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి యత్నించారా? వారు వీరు ఒకటేనా అనే విషయం తేలాల్సి ఉంది.