rowdy sheeters murder: హైదరాబాద్‌లో రౌడీ గ్యాంగ్స్ పెరిగిపోతున్నాయా..? తమ ఉనికిని చాటుకోడానికి రౌడీషీటర్స్ ప్రయత్నిస్తున్నారా..? రౌడీషీట్‌ను ఓ బిరుదులాగా భావిస్తున్నారా..? అందుకే పగలు, ప్రతీకారాలంటూ ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటున్నారా..? అంటే అవుననే అన్పిస్తోంది. నగరంలో ఓ హత్య ఘటన మరువక ముందే మరో హత్య వెలుగులోకి వస్తుండటమే అందుకు నిదర్శనం.
భాగ్యనగరంలో రక్తచరిత్ర మూవీ తరహా హత్యలు.. రౌడీషీటర్ల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు.. ఒకరినొకరు హతమార్చి ఉనికిని చాటుకునే యత్నం.. ఓ హత్య ఘటన మరుగున పడకముందే మరో హత్య.. 2018లో 27మంది..2019లో 18 మంది దారుణ హత్య.. ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది రౌడీషీటర్ల హత్య
జనంలో భయం లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు:
రౌడీషీట్ ఉంటే అదో బిరుదని భావించే నేరస్థులు…ఇప్పుడు తమ ఉనికిని చాటుకోడానికి ప్రత్యర్థి వర్గాలను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రౌడీషీటర్లంటే జనంలో భయం లేకుండా పోవడం కూడా వారికి రుచించడం లేనట్లు కనిపిస్తోంది. తమకి సలాం కొడుతూ…హఫ్తాలు చెల్లిస్తూ ఉంటేనే తమ ఉనికి నిలబడుతుందని భావించే వారిని…కొంతకాలంగా పోలీసుల ఉక్కుపాదం అణచివేస్తోంది. అయినా తమ ఉనికిని చాటి చెప్పాలనే ప్రయత్నంలో రౌడీ గ్యాంగ్‌లు ప్రత్యర్థి వర్గాలను అంతమొందించాలనే ఆలోచనతో పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు తరచుగా హైదరాబాద్‌లో వెలుగులోకి వస్తున్న ఘటనలే నిదర్శనం.
2018లో 27మంది రౌడీషీటర్ల హత్య.. 2019లో 18 మంది దారుణ హత్య:
పోలీసులు ఓ వైపు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతూ..మరోవైపు నేరాల బాట వీడిన వారిపై రౌడీషీట్లు తొలగిస్తూ ముందుకు సాగుతుంటే..నేర ప్రపంచంలో ఇప్పటికీ కక్షలు, ప్రతీకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రౌడీల్లో ఆధిపత్య పోరు కనిపిస్తూనే ఉంది. ప్రతి చిన్న గొడవకీ ఓ రౌడీని మరో రౌడీ హతమార్చడం సర్వసాధారణమై పోయింది.
తాజాగా కుల్సుంపురా పీఎస్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ హత్యతో ఈ ఏడాది(2020) ఇప్పటివరకు హత్యల్లో చనిపోయిన రౌడీల సంఖ్య 14కి చేరుకుంది. 2019లో 18 మంది రౌడీలు హత్యకు గురి కాగా…2018లో 27మంది హతమయ్యారు. ఈ ఏడాది సగం లాక్‌డౌన్‌లో గడిచి సిటీ లైఫ్ మొత్తం పోలీసుల అదుపులోనే ఉంది. అయినా 9 నెలల వ్యవధిలోనే 14మంది హత్యకు గురయ్యారంటే.. పగలు, ప్రతీకారాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అక్టోబర్ 6 కుల్సుంపురా పీఎస్ పరిధిలో, సెప్టెంబర్ 5న ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో హత్య:
అక్టోబర్ 6న..కుల్సుంపురా పీఎస్ పరిధిలో రౌడీషీటర్ అబ్దుల్ ఖాదిర్‌ను..మరో రౌడీషీటర్ మహ్మద్ అక్తర్ పక్కా ప్రణాళికతో హతమార్చాడు. పాతకక్షల కారణంగానే అబ్దుల్ ఖాదిర్‌ను మహ్మద్ అక్తర్ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక సెప్టెంబర్ 5 తెల్లవారుజామున ఫలక్‌నుమా పీఎస్ పరిధిలోని అన్సారీ రోడ్ దగ్గర జాడో జావిద్ అలియాస్ జావిద్ అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. జాడో జావిద్‌కు వ్యతిరేక రౌడీ వర్గానికి చెందిన గ్యాంగు సభ్యులే ఆధిపత్య పోరులో అతన్ని హతమార్చినట్లు తెలిసింది. కొంతకాలంగా ప్లాన్ చేసి అతన్ని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఆగస్టు 15 రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలో.. ఆగస్టు 9 చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో హత్య:
ఆగస్టు 15న రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయాజుద్దీన్ అలియాస్ అయాజ్ అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. చందానగర్ ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న అయాజ్‌ను అడ్డుకున్న కొంతమంది అతనిపై మారణాయుధాలతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అదే నెల 9న చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాజిద్ అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. వివిధ నేరాల్లో నిందితుడిగా ఉన్న సాజిద్ గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ రోజు రాత్రి స్నేహితులతో కలిసి కూర్చుని ఉండగా మరో గ్యాంగ్ సభ్యులు కత్తులతో దాడి చేశారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14మంది రౌడీషీటర్లు హతం:
ఇక జూన్ 25న దిల్‌సుక్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలో ఓ రౌడీ షీటర్‌ను అతని సొంత బంధువులే గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత తల్లికి ఫోన్ చేసి హతమార్చినట్లు సమాచారం కూడా అందించి పరారయ్యారు. జూన్ 5న లంగర్‌హౌజ్ పీఎస్ పరిధిలో అర్థరాత్రి ఓ రౌడీషీటర్‌పై మూకుమ్మడి దాడి జరిగింది.
ఈ దాడిలో రౌడీషీటర్‌తో పాటు అతని స్నేహితుడు కూడా మృత్యువాత పడ్డాడు. ఫిబ్రవరి ఒకటిన కామాటిపురా పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన సయ్యద్ ఇమ్రాన్‌పై ముగ్గురు యువకులు దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఏడు హత్యలే కాకుండా…ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 14 మంది రౌడీ షీటర్లు..తమ తమ ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యలకు గురయ్యారు.