Adulterated Ginger Garlic Paste(Photo : Google)
Fake Ginger Garlic Paste : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అన్నింటిని కల్తీ చేసేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు కల్తీ చేసిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు కేటుగాళ్ల కళ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద పడ్డాయి. అల్లం వెల్లుల్లి పేస్ట కూడా కల్తీ చేస్తున్నారు.
రాజేంద్రనగర్ లో కలకలం రేగింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పోలీసులు పట్టుకున్నారు. 200 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఎంఎం పహాడీలోని గృహ నివాసాల మధ్య ఓ పరిశ్రమలో నకిలీ అల్లం వెల్లులి పేస్ట్ తయారు చేస్తున్నారు.
Also Read..Rs 2000 denomination: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇలా మార్చుకోండి.. టెన్షన్ వద్దు.
పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవు. అక్కడంతా అపరిశుభ్ర వాతావరణమే. నాణ్యతా ప్రమాణాలు అస్సలు లేవు. డబ్బాలకు మూతలు లేవు. కుళ్లిన అల్లం, పాడైన వెల్లుల్లి. అంతకుమించి.. ప్రమాదకరమైన, హానికారకమైన కెమికల్స్ తో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నారు.
ప్రమాదకరమైన అసిటిక్ యాసిడ్ ను అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వాడి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MM పహాడీలో ఎస్ఓటీ బృందం దాడులు నిర్వహించింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న సొహైల్ ను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన
ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని డాక్టర్లు అంటున్నారు. దీని కారణంగా జబ్బుల బారిన పడతారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు ఆశతో ఆహార పదార్దాలను కల్తీ చేస్తున్న కేటుగాళ్లను అత్యంత కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి దందాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు అంటున్నారు.