రైతు రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రైతు అప్పులు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ఫిబ్రవరి నెలలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ప్రకటించారు సీఎం. ఇందుకు రూ. 6వేల కోట్లు కేటాయించారు.
2018 డిసెంబర్ 11వ తేదీలోపు రైతులు తీసుకున్న అప్పుల్లో లక్ష రూపాయలను నాలుగు దఫాలుగా మాఫీ కానున్నాయి. అదే విధంగా రైతు బంధు కింద ప్రస్తుతం ఎకరానికి ఇస్తున్న రూ. 4 వేల మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుతున్నారు. ఈ బడ్జెట్ లో 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. మొదటి రుణమాఫీ కింద 35.19 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. కొత్తగా చేస్తున్న రుణమాఫీ వల్ల 48.14 లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని అంచనా వేస్తోంది.
జూన్ నెల నుంచి వర్షాకాలం స్టార్ట్ కానుంది. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే విధివిధానాలపై కసరత్తు ప్రారంభించింది వ్యవసాయ శాఖ. రుణమాఫీ, రైతు బంధును నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రుణమాఫీ నాలుగు విడతలుగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని.. తొందరలోనే పంటలకు సంబంధించిన రుణమాఫీని ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే కేబినెట్ సమావేశం జరుగుతుందని..వ్యవసాయ ప్రణాళికకు ఆమోదం వేస్తామని తెలిపారు.
మే 28న కేబినెట్ మీటింగ్ ?
2019, మే 28వ తేదీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. రుణమాఫీకి ఆమోదం లభించనుంది. రైతు బంధు, ఆసరా, రెవెన్యూ కొత్త చట్టం తదితర వాటిపై చర్చించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా శాఖలకు పలు ఆదేశాలు జారీ చేశారు. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం ఎన్నికల కోడ్ తొలగిపోనుంది. ఆ వెంటనే 28వ తేదీ కేబినెట్ మీటింగ్ లో ఆమోదంతో జూన్ నెల నుంచి వివిధ పథకాల కింద రైతులకు లబ్ది చేకూరనుంది.