Telangana ranks 1st in the country in human trafficking NCRB Report
Telangana ranks 1st in the country in human trafficking NCRB Report : సైబర్ నేరాల్లో, మానవ అక్రమరవాణాలో తెలంగాణా మరోసారి మొదటిస్థానంలో ఉంది. 2021లో తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని ఎన్సీఆర్బీ 2021 నివేదిక వెల్లడించింది. మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక నేరాలు వంటి విషయాల్లోనూ సైబర్ నేరాల్లోను తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. గతంకంటే సైబర్ నేరాలు 200శాతం పెరిగాయని..అలాగే ఆత్మహత్యలు చేసుకోవటంలో కూడా తెలంగాణ 4వ స్థానంలో ఉందని వెల్లడించింది.
ఒకపక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని..తెలంగాణ అమలు చేస్తోంది దేశం అనుసరిస్తోంది అంటూ పాలకులు చెబుతున్నారు. కానీ అభివృద్ధి మాటేమోగానీ నేరాల సంఖ్యలో మాత్రం దేశంలో మొదటిస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సైబర్ నేరాలలో, మానవ అక్రమ రవాణాలో, ఆహార కల్తీ కేసుల్లో తొలి స్థానంలో ఉందని ఎన్సిఆర్బి షాకింగ్ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన అనేక కేసుల పై 2021 సంవత్సరానికిగానూ రాష్ట్ర పరిస్థితిని వివరించిన ఎన్సీఆర్బీ ఆదివారం (ఆగస్టు 28,2022) విడుదల చేసిన నివేదిక తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని కళ్లకు కడుతుంది.
రాష్ట్రంలో 2019 లో 1,18,338 కేసులు, 2020లో 1,35,885 కేసులు, 2021లో 1,46,131 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 52,430 సైబర్ నేరాలు నమోదైతే దాదాపు 20 శాతం తెలంగాణ రాష్ట్రం లోనే జరగటం గమనించాల్సిన విషయం. ఇక నేరాలకు అడ్డాగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాల్లో దేశంలో తెలంగాణ తరువాత రెండో స్థానంలో ఉంది. ఆర్థిక మోసాల కోణంలో జరిగిన సైబర్ నేరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాలోనూ తెలంగాణ తొలి స్థానంలో ఉంది. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన ఆర్థిక కేసుల్లో తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. ఇక వృద్ధులపై జరిగే దాడులలో మూడవ స్థానంలో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉంది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో తెలంగాన పరిస్థితి.. కాదు కాదు దుస్థితి అని చెప్పాలి.
ఐటీ హబ్‌గా వెలిగిపోతున్న భాగ్యనగరంలో సైబర్ క్రైమ్‌ల ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా కూడా ఉంగని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) విడుదల చేసిన డేటా ప్రకారం 2020లో దేశంలో జరిగిన మొత్తం సైబర్ మోసాలలో తెలంగాణ 10 శాతం మోసాలను నమోదు చేసింది. ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా-2020 నివేదిక ప్రకారం 2019లో 2,691 కేసులుండగా, తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 13.4 కేసుల చొప్పున 2020లో సైబర్ నేరాల సంఖ్య 5,024కి పెరిగింది. 2021లో తెలంగాణలో సైబర్ నేరాలు రెండు రెట్లు పెరిగాయి. ఏడాది కాలంలో మొత్తం 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2020లో 1,379 కేసులు నమోదవగా, ఒక్క హైదరాబాద్ పోలీసులే 2021 వ సంవత్సరంలో 5,646 సైబర్ క్రైమ్‌ల కేసులు నమోదు చేశారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు సైబర్ క్రైం బారిన పడుతున్నట్టుగా సమాచారం.