Three held for Red sandalwood smuggling
Red Sandalwood Smugglers : చిత్తూరు జిల్లా అలిపిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రవాణా చేయటానికి సిధ్ధంగా ఉన్న 34 ఏర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు.
అలిపిరి రోడ్డులో టీటీడీ ఎన్‌క్లోజర్‌లో అరవింద కంటి ఆస్పత్రి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్ర చందనం దుంగలను కారులోకి ఎక్కిస్తూ కనిపించారు. దీంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు.
Also Read : SiddeswaraKona Water Falls : సిద్ధలేశ్వర కోనలో అదృశ్యమైన యువకుడు మృతి
ఈ క్రమంలో కొందరు స్మగ్లర్లు దుంగలు కిందపడేసి పారిపోయారు. ముగ్గురు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన బాల మురుగన్ (24), వెంకటేషన్ (27), అన్నాదురై (43) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరు లోడ్ చేస్తున్న జైలో వాహనంతో పాటు 34 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.