×
Ad

Amberpet Incident: దేవుడు పిలుస్తున్నాడని.. కుటుంబం మొత్తం ఉరేసుకుని.. అంబర్‌పేట్‌లో దారుణం..

అప్పటి నుంచి దేవుడు తమను పిలుస్తున్నాడని తరుచూ చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ కారణంతోనే..

Amberpet Incident: హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. దేవుడు పిలుస్తున్నాడు అంటూ ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అంబర్ పేట రామకృష్ణనగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు తమ చిన్న కూతురు శ్రావ్యతో కలిసి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పెద్ద కూతరు బలవన్మరణానికి పాల్పడింది. శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పుడే రామకృష్ణనగర్ లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని షిప్ట్ అయ్యారు. కానీ, పెద్ద కూతురి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి దేవుడు తమను పిలుస్తున్నాడని తరుచూ చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

‘శ్రీనివాస్ కు ఇద్దరు కూతుర్లు. నాలుగు నెలల క్రితం పెద్దమ్మాయి చనిపోయింది. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. చిన్నమ్మాయి టెన్త్ చదువుతోంది. పెద్దమ్మాయి చనిపోయినప్పటి నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి చాలా బాధలో ఉన్నారు. మా పెద్ద కూతురు చనిపోయింది, మేము కూడా ఉండం, అలానే చనిపోతాం అని చెప్పేవాళ్లు. దేవుడు పిలుస్తున్నాడు మేము కూడా అక్కడికి వెళ్తాం అని పదే పదే అనేవాళ్లు’ అని మృతుడి బంధువు తెలిపారు.

రెండు రోజుల క్రితమే శ్రీనివాస్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. గతంలో వీరి కుటుంబం ఎక్కడ ఉండేది, పెద్ద కూతురు ఏ కారణాలతో చనిపోయింది, అసలేం జరిగింది? ఇలా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు.