Ranga Reddy Dist Lorry Incident : రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురు చిరు వ్యాపారులు మృతి..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Ranga Reddy Dist Lorry Incident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ టైర్ల కింద పలువురు నలిగిపోయారు. కాళ్లు, చేతులు విరగడంతో క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్-బీజాపూర్ పక్కన దాదాపు 50మంది కూరగాయలు విక్రయిస్తున్నారు. లారీ తమ వైపునకు దూసుకురావడం చూసిన విక్రయదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ, వేగంగా దూసుకొచ్చిన లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది.

లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. లారీ ఎంత వేగంతో వస్తోందంటే.. ఆ వేగానికి అది ఢీకొట్టిన చెట్టు కూడా విరిగిపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

Also Read : ప్రేమ వ్యవహారమా? పని ఒత్తిడా? కలకలం రేపుతున్న వాజేడు ఎస్ఐ బలవన్మరణం..