Darbhanga Blast Case
Darbhanga Blast Case : బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ అనే సోదరులిద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వీరిరువురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు అన్నారు.
దర్బంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న పార్సిల్ బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి పార్సిల్ వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం చేసేలా ఎల్ఈటీ కుట్ర పన్నినట్లు తెలిపారు.
మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్తాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణతో పాటు రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి నసీర్ ఐఈడీ తయారు చేశాడరన్నారు. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్బంగా రైల్‌లో పార్సిల్ పంపారు. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర పన్నినట్లు తెలిపారు.
నిందితులను లోతుగా ప్రశ్నించి భారీ కుట్రను ఛేదించాల్సి ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరూ ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారని… చాలా కాలంగా హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో నివసిస్తూ రెడీమేడ్ బట్టల షాపు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.