ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇంతలో కరోనా కారణంగా స్వదేశానికి రావడమే తన పాలిట శాపమైంది. ఇద్దరు యువకుల ఈవ్ టీజింగ్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ శహర్ కు చెందిన సుదీక్షా భాటి (20) చదువుల్లో మేటి. 2018లో ఇంటర్మీడియట్ సెకండియర్ సీబీఎస్సీ పరీక్షల్లో 98 శాతం మార్కులు సాధించింది. తన ప్రతిభకు మెచ్చి హ్యుమానిటీస్ విభాగంలో మసాచుసెట్స్ లోని బాబ్సన్ కాలేజీ పూర్తిస్థాయి స్కాలర్ షిప్ ను అందించింది. అప్పటినుంచి అక్కడే తన చదువును కొనసాగిస్తోంది.
అయితే కరోనా విజృంభణ కారణంగా అమెరికా నుంచి సొంతూరుకు వెళ్లింది. తాను చదువుకున్న స్కూల్ నుంచి అవసరమైన కొన్ని కాగితాలు తెచ్చుకోవడానికి బంధువుతో కలిసి బైక్ పై బయలుదేరింది. అటుగా మరో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి వాహనాన్ని ఇష్టం వచ్చినట్లు ఢీకొంటూ ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు.
‘ఇద్దరు వ్యక్తులు బైక్ ను నిర్లక్ష్యంగా నడుపుతూ మమ్మల్ని ఢీకొట్టారు. ఇష్టం వచ్చినట్లు తన మీద వ్యాఖ్యలు చేశారు. బైక్ తో మా ముందు స్టంట్లు చేశారు. దాంతో మేం వేగం తగ్గించగా ఒక్కసారిగా వేరే వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరం కిందపడిపోయాం. కానీ ఆమె తలకు బలంగా దెబ్బలు తగిలాయి. అనంతరం బైక్ నడిపే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ వ్యక్తిని చూడలేకపోయాను’ అని సుదీక్ష అంకుల్ సాతేందర్ భాటి వెల్లడించారు.
ఈ ఘటనపై యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందిస్తూ తెలివైన విద్యార్థిని ఈవ్ టీజింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇలాగైతే ఆడపిల్లలు ఎలా ముందుకెళ్తారు. వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
కాగా, ఈవ్ టీజింగ్ ఆరోపణలను బులందర్ శహర్ పోలీసులు కొట్టిపారేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ కారణంగా ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వీరి బైక్ ను అటుగా వెళ్తోన్న వేరే వాహనం ఢీకొందని కొందరు పత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బంధువు, ప్రత్యక్ష సాక్షులు ఎవరూ ఈవ్ టీజింగ్ గురించి మాట్లాడలేదు’ అని బులందర్ శహర్ పోలీసు ఉన్నతాధికారి అతుల్ శ్రీవాస్తవ వెల్లడించారు.