up 14 year old dalit girl body: ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో దళిత యువతిపై ఘోర అత్యాచారం ఇంకా మరచిపోనేలేదు. ఆమె అంత్యక్రియల నిప్పులు చల్లారనే లేదు. ఇంతలో మరో బాలిక కామాంధులకు బలైపోయింది. అత్యాచారానికి తెగబడిన కామాంధులకు శిక్షించాలని నిసనలు..డిమాండ్లు వెల్లువెత్తునే ఉన్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటునే ఉన్నాయి. వారి కంటి చెమ్మ ఆరనే లేదు. ఇంతలోనే 14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది.
యూపీలోని భడోహి పట్టణంలోని తివారీపూర్ గ్రామం గోపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం (అక్టోబర్ 1,2020) ఉదయం 14 ఏళ్ల దళిత బాలిక బహిర్భూమికి వెళ్లింది. ఆమెను వెనుకే ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. కానీ ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా శవమై కనిపించింది. బాలిక పడిఉన్న తీరు చూడగా..ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది.
దీంతో పొరుగునే ఉన్నవారిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈరోజు అంటే శుక్రవారం (అక్టోబర్ 2,2020) గాంధీ జయంతి రోజున ఉదయం ముగ్గురు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం తేలాల్సిఉందని పోలీసు సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ తెలిపారు.కానీ అత్యాచారం జరిగిందో లేదో తెలియాల్సి ఉందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
కాగా..యూపీలో అత్యాచారాల పర్వానికి ఏ మాత్రం తెరపడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మహిళలు, బాలికలు, యువతులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నేరాలకు అడ్డాగా…ఆడపుట్టుకల మీద అత్యాచారాలు..అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.