1400 కోట్ల రూపాయల బ్యాంకు స్కాం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈవో వాసుదైవ్ మైయా (70) అనుమానాస్పదస్ధితిలో మృతి చెందారు. జులై 6వ తేదీ సోమవారం సాయంత్రం బెంగుళూరు లోని తన ఇంటి బయట పార్క్ చేసిన కారులో ఆయన శవమై కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న సుబ్రహ్మణ్యపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాసుదేవ్ 2012-2018 సమయంలో బ్యాంకు సీఈవోగా పదవిలో కొనసాగారు. ఆ కాలంలో ఆయనపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, రిజిష్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ తదితర విభాగాలు మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేశాయి. కాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 1400 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలపై ఈ ఏడాది జనవరిలో దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ఆర్‌బీఐ ఆరు నెలలపాటు ఆంక్షలు విధించింది.
డిపాజిటర్ ఉపసంహరణ మొత్తాన్ని35 వేల రూపాయలకు పరిమితం చేసింది. ఆ తరువాత గత నెలలో ఈ పరిమితిని ఒక లక్ష రూపాయలకు పెంచింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ ఆంక్షలు ఉన్నప్పటికీ, చాలా మంది సీనియర్ సిటిజన్లు తమ డబ్బులను ఉపసంహరించుకునేందుకు బ్యాంకు ముందు క్యూలు కట్టారు.
ఈ కేసు విచారణలో భాగంగా జూన్ 18న ఏసీబీ అధికారులు శ్రీ గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు చెందిన ఐదు కార్యాలయాలు, వాసుదేవ్ ఇల్లు, బ్యాంక్ చైర్మన్ కె రామకృష్ణ నివాసాల వద్ద కూడా దాడులు జరిపి తనిఖీలు నిర్విహించింది. దీంతో దర్యాప్తునకు భయపడిన వాసుదేవ్ మైయా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Here>>PPE Suitలతో జ్యూయలరీ షాపులో దొంగతనం