కాలేజీ విద్యార్ధినిపై అత్యాచారం కేసులో నటుడి కుమారుడు అరెస్ట్

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేటగాడి వలలో చిక్కిన లేడి పిల్లలా ఆడవాళ్లు మగవాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. 1980 దశకం సినిమాల్లో విలన్ చేసినట్లు…. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఒక కాలేజీ యువతిపై అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేసిన కేసులో తమిళ నటుడు ఇటీవల అరెస్టయ్యాడు.
ఇతని తండ్రి కూడా ప్రముఖ తమిళ నటుడు, ఎఐఎడిఎంకె అధికార ప్రతినిధి.ప్రముఖ తమిళ నటుడు సూర్యకాంత్ కుమారుడు, విజయ్ హరీష్ చెన్నై లోని అన్నా నగర్ లో నివసిస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వేరే స్నేహితుడి ద్వారా నగరంలోని ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదివే విద్యార్ధిని (19) పరిచయం అయ్యింది. విజయ్ హరీష్ కూడా “నంగలం నల్లవంగధన్” (మేము మంచివాళ్లమే) అనే చిత్రంలో నటిస్తున్నాడు. కానీ ఇతను చేసిన పనులే మంచిగా లేవు. అదే ఇక్కడ కొస మెరుపు.
జనవరి 2న విజయ హరీష్ తన స్నేహితురాలిని విరుగంబాక్కంలోని ఒక అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లాడు. అక్కడ అమెకు మత్తు మందు కలిపిన ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాడు. అది తాగి ఆమె అపస్మారక స్ధితిలోకి వెళ్లాక ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను అశ్లీలంగా వీడియో తీశాడు.
ఆమెకు తెలివి వచ్చిన తర్వాత ఆమెనుఇంటి దగ్గర దింపేశాడు. ఇక ఆ తర్వాత నుంచి 80 వ దశకంలో సినిమా విలన్లు ప్రవర్తించినట్లు చేశాడు. తాను తీసిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. తాను పిలిచినప్పుడల్లా వచ్చి తన కోరిక తీర్చి తనకు సహకరించాలన్నాడు.
అందుకు ఆమె ఒప్పుకోక పోవటంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. నటుడు విజయ్ హరీష్ బెదిరింపులకు షాక్ కు గురైన ఆ విద్యార్ధిని చెన్నై డిప్యూటీ పోలీసు కమీషనర్ జయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేసింది.
ఆమె ఆదేశాల మేరకు తిరువత్తియూర్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు విచారించి నిందితుడు విజయ్ హరీష్ ను అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ 328,343,354బి,354సీ,376, 506 ఐ, కింద కేసులు నమోదు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.