ఇంటర్నేషనల్ క్రిమినల్స్ : విమానాల్లోనే.. ఇస్త్రీపెట్టెతో నకిలీ వీసాలు తయారీ
ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లే వలస కార్మికులను ఏమార్చుతూ నకిలీ వీసాలను అంటగట్టి మోసగిస్తున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లే వలస కార్మికులను ఏమార్చుతూ నకిలీ వీసాలను అంటగట్టి మోసగిస్తున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటే వీసా కావాలి.. ఎందుకు వెళుతున్నామో చెబితే.. అందుకు సంబంధించిన వీసా ఇస్తారు. ఉదాహరణకు బిజినెస్ వీసా తీసుకున్నారు. దానిపై టికెట్ తీసుకుని ఫ్లయిట్ ఎక్కారు. ఆ దేశంలో దిగినప్పుడు మీ బిజినెస్ వీసా కాస్తా.. టూరిజం వీసాగా మారిపోతే.. ఏంటీ అవాక్కయ్యారా.. ఫ్లయిట్ లో ఎలా మారిపోతుంది అనే డౌట్ వచ్చిందా.. మీది డౌట్ కాదు.. దీన్ని నిజం చేశారు కేటుగాళ్లు. హైదరాబాద్ కేంద్రంగా ఎయిర్ లైన్స్ సిబ్బంది, ఏజెంట్లు, పోలీసులు ముఠాగా ఏర్పడి సాగించిన ఇంటర్నేషనల్ చీటింగ్ ను బయటపెట్టారు హైదరాబాద్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇస్త్రీపెట్టెతో వీసా ఎలా మారిపోతుంది?
ముఠాగా ఏర్పడిన ఏజెంట్లు ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయం ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టును సేకరిస్తారు. ఆ వెంటనే.. ఇస్త్రీపెట్టెను బాగా హీట్ చేసి.. పాస్‌పోర్టుకు అంటించిన వీసా స్టిక్కర్‌ను తొలగిస్తారు. ఇంక్ రిమూవర్‌తో మిగిలిన స్టాంప్‌ను తుడిచేస్తారు. ఆ స్టిక్కర్ ను ఏజెంట్లు ఇతరుల పాస్ పోర్టులకు అంటిస్తారు. నకిలీ స్టాంపులతో ముద్రలు వేస్తారు. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం 10వ తరగతి చదువుకోని వారు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) క్లియరెన్స్‌ను తప్పించుకునేందుకు ఎంప్లాయిమెంట్ వీసా స్థానంలో నకిలీ విజిట్ వీసాను కంప్యూటర్‌లో ఫొటోషాప్ ద్వారా మారుస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయాల ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తీసుకున్న ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’ వినియోగించి నకిలీ విజిట్ వీసాను సిద్ధం చేసేవారు.
కువైట్ వెళ్లాలంటే కఠిన నిబంధనలు :
ఉద్యోగ వీసాపై వెళ్లాలంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం కువైట్‌లో ఉద్యోగం ఇచ్చే యజమాని ప్రవాసీ భారతి బీమా యోజన కింద రూ.లక్షా 50వేల వరకు ఉద్యోగిపై ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం తనిఖీ చేస్తారు. వీటినుంచి తప్పించుకునేందుకు ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’ మార్గాన్ని ఎంచుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కువైట్‌కు వెళ్లే వలస కార్మికులను ఏమార్చుతూ నకిలీ వీసాలను అంటగట్టి మోసగిస్తున్నారని వివరించారాయన. ఉద్యోగ వీసాను టూరిజం వీసాగా మార్చి.. ఇమ్మిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా చేస్తున్న 15 మంది ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.
నకిలీ వీసాలు స్వాధీనం :
నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు, రబ్బర్ స్టాంప్‌లు, 160 పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌లతో పాటు రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2019 మార్చి నెలలోనే నకిలీ వీసాలపై ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో 10 కేసులు నమోదయ్యాయి. 2019 జనవరి నుంచి 14 కేసులు నమోదైతే 71 మందిని అరెస్టు చేశామన్నారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంటున్న నెల్లూరు జిల్లా కలువాయిమండలం వెంకటరెడ్డిపాలెంకి చెందిన తోట కంఠేశ్వర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల ముఠా కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని కువైట్‌లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీరికి విదేశాలకు పంపించే అనుమతి లేకపోవటంతో ముంబై, బెంగళూరు, శ్రీలంకలోని లీగల్ ఏజెంట్లను కలిసి ఎంప్లాయిమెంట్ వీసాలు తెప్పిస్తున్నారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో రూ.135 ఫీజు చెల్లించి చేవెళ్ల చిరునామాలు ఇస్తారు. అక్కడి పోలీసు కానిస్టేబుల్ జి.మధు రూ.2వేల 500 తీసుకుని క్లియరెన్స్ ఇచ్చేవాడు.
విజిట్ వీసాతో పాటు నకిలీ తిరుగు ప్రయాణ టికెట్‌లను గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి మహమ్మద్ ముజీబ్ ఖాన్, ఒమన్ ఎయిర్ ఉద్యోగి అనప్పరెడ్డి రామలింగారెడ్డి సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన పలువురిని కువైట్‌కు పంపించినట్టు తేలింది. ఈ ముఠా సభ్యులైన తోట కంఠేశ్వర్, సురేందర్, నర్సింహ, అనిల్ కుమార్, యుగంధర్, వినయ్ కుమార్, వెంకటసుబ్బారాయుడులను పోలీసులు అరెస్టు చేశారు. చేవెళ్ల పోలీసు కానిస్టేబుల్ మధును కూడా అరెస్టు చేశారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు ప్రకటించారు సీపీ సజ్జనార్.
ఆరు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయిస్తుంది ఈ ముఠా. ఫిట్ ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి.. లేకపోతే ట్రాన్సిట్ పాస్‌పోర్టుపై ఏడు రోజుల వీసాతో శ్రీలంకకు పంపించే బాధ్యతను 8 మంది సభ్యులతో కూడిన పుష్ప అనే మహిళ చూసుకుంటుంది. ఈ ముఠాలో ఉన్న ఏపీకి చెందిన గెడ్డం శశి, చింతల సాయిరామ్‌కుమార్, షేక్ అక్రమ్, పిల్లి శ్రీకర్, అకరం బాలకృష్ణ, షేక్ ఖాదర్ బాషా, పూసపాటి రామకృష్ణ, విజయభాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.