Vizag Mounika Murder Case : విశాఖ మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు.. ఆ ఫొటోలు, వీడియోలు ఉన్నాయా?
Vizag Mounika Murder Case : విశాఖపట్నంలో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన మౌనిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
Vizag Mounika Murder Case Police reveals shocking details
- వైజాగ్ మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు
- డబ్బులు ఇవ్వాలంటూ రవీంద్రపై ఒత్తిడి
- ఫోటోలు, వీడియోలు భార్యకు పంపిస్తానని బెదిరించడంతోనే దారుణం
Vizag Mounika Murder Case : విశాఖపట్నంలోని గాజువాకలో ఆదివారం దారుణం వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి ఒకరు మహిళను దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుడైన రవీంద్రకు.. 2023లో ‘మింగిల్’ అనే డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంవత్సరం క్రితం రవీంద్రకు శ్రీలక్ష్మి అనే మహిళతో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలోనే రవీంద్ర, మౌనికల మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత మౌనిక.. కొద్ది కాలం పాటు రవీంద్రకు దూరంగా ఉంది.
రవీంద్ర భార్య శ్రీలక్ష్మి గర్భవతి కావడంతో ఇటీవలే ఆమె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న మౌనిక మళ్లీ రవీంద్రతో టచ్‌లోకి వచ్చింది. తన అవసరాల కోసం డబ్బు కావాలని మౌనిక.. రవీంద్రపై ఒత్తిడి చేయసాగింది. దీంతో ఇప్పటికే రవీంద్ర.. రూ. 3 లక్షలకు పైగా మౌనికకు ఇచ్చాడు. అయినా ఆమె వేధింపులు ఆగలేదు. పైగా తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. వారి బంధాన్ని బయటపెడతానని, ఫోటోలు, వీడియోలు రవీంద్ర భార్యకు పంపుతానని ఇటీవల మౌనిక హెచ్చరించింది.
డబ్బు కోసం మౌనిక చేస్తున్న వేధింపుల గురించి రవీంద్ర తన స్నేహితుల వద్ద చెప్పుకుని బాధపడ్డాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా మౌనిక అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం మౌనికను చంపేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్న రవీంద్ర.. ఆ పథకం ప్రకారమే.. గాజువాక ఎల్వీ నగర్ ప్లాట్‌కి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చే సమయానికి రవీంద్ర స్నేహితుడు, సోదరుడు ప్లాట్‌లో లేరు.
తన ఇంటికి వచ్చిన మౌనికను బెడ్ రూమ్‌లోకి తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు రవీంద్ర. ఆ తర్వాత మౌనిక మొహంపై పిల్లో (దిండు) అదిమి ఊపిరి ఆడకుండా చేశాడు. ఆపై మౌనిక మృతదేహాన్ని కట్ చేయడం కోసం.. ఇన్‌స్టా మార్ట్‌లో కత్తి, కవర్లు కొనుగోలు చేశాడు. అలా తీసుకువచ్చి కత్తితో మౌనిక శరీర భాగాలను తల, చేతులు, కాళ్లు నరికి వేర్వేరుగా ప్యాకింగ్ చేశాడు. వీటిల్లో కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో దాచాడు. మరికొన్నింటిని ట్రాలీ బ్యాగ్‌లో, తల, చేతులను బ్యాగ్‌లో ప్యాక్ చేసి ధారపాలెంలో తగలబెట్టాడు.
ఆ తర్వాత తాను చేసిన దారుణం గురించి స్నేహితుడికి చెప్పగా.. పోలీసులకు లొంగిపోవాలని అతను సూచించాడు. స్నేహితుడి సూచనతో రవీంద్ర గాజువాక సీఐ ముందు సరెండర్ అయ్యాడు. కేసు నమోదు చేశాక.. పోలీసులు విచారణ తర్వాత నిందితుడు రవీంద్రపై ఎఫ్ఐఆర్ నంబర్ 119/2026 U/S 103(1), 238(a) BNS గా సెక్షన్లు విధించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. మౌనిక, రవీంద్ర ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.
