Wanaparthy Married Woman Filed A Complaint She Want Her Lover
Extra Marital Affair : వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నా…కుటుంబ వ్యవస్ధ విఛ్చిన్నమవుతున్నా వాటి గురించి పట్టించుకోకుండా, క్షణికావేశంలో అక్రమసంబంధాలవైపే ప్రజలకు ఆసక్తి ఎక్కువవుతోంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నవివాహిత ప్రియుడిపై మోజుతో మొగుడు,పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. తనకు మొగుడు పిల్లలు వద్దని, ప్రియుడితోనే కలిసి ఉంటానని పోలీసులను కోరింది.
వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సుజాతకు పెళ్లైంది. భర్త, పదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు ఉన్నారు. అమరచింతలో వారు ఉంటున్న కాలనీకే చెందిన రాకేష్ అనే యువకుడితో సుజాతకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేపి ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
ప్రియుడి మోజులో ఉన్న సుజాత భర్త, పిల్లల్నివదిలేసి నెల రోజుల క్రితం ప్రియుడితో కలిసి పారిపోయి వరంగల్ చేరుకుంది. భార్యా భర్తలమని చెప్పి వరంగల్ లో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ సహజీవనం చేయసాగారు. ఇద్దరి కోసం రెండు కుటుంబాల వారు తీవ్రంగా గాలించారు. చివరకు వరంగల్ లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మే 21న రాకేష్ కుటుంబ సభ్యలు వరంగల్ చేరుకున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి అమరచింత తీసుకువచ్చారు. సుజాతను ఆమెభర్త వద్ద దింపి… రాకేష్ ను వారింటికి తీసుకువెళ్లారు.
కాగా సోమవారం మే 24వ తేదీ ఉదయం సుజాత అమరచింత పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. తాను రాకేష్ తోనే కలిసి జీవిస్తానని… ఇద్దరం వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఎన్ని కష్టాలెదురైనా రాకేష్ తోనే ఉంటానని తెలిపింది.
రాకేష్ పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని …రాకేష్ ను తననుంచి దూరంచేశారని, రాకేష్ ను ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా మొబైల్ కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆమె ఆరోపించింది. సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ చెప్పారు.