ప్రపంచ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అకౌంట్లపై సైబర్ ఎటాక్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 20దేశాల్లోని హైప్రొఫైల్ అధికారులే లక్ష్యంగా సైబర్ దాడికి ప్రయత్నించినట్టు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సంయుక్త దేశాలకు సంబంధించిన సీనియర్ ప్రభుత్వ అధికారుల ఫోన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ తో నిఘా పెట్టినట్టు సంస్థ గుర్తించింది.
వాట్సాప్ కంపెనీ ప్రత్యేకించి జరిపిన విచారణలో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ కు చెందిన NSO అనే గ్రూపు స్పైవేర్ సాఫ్ట్ వేర్ టూల్ సాయంతో హైప్రొఫైల్ ప్రభుత్వ అధికారుల వాట్సాప్ అకౌంట్లపై రహస్యంగా నిఘా పెట్టినట్టు వాట్సాప్ ట్రేస్ చేసింది.
మొత్తం 20 దేశాల్లోని ఐదు ఖండాంతరాల్లోని హైప్రొఫైల్ ప్రభుత్వ అధికారులు, మిలటరీ అధికారుల అకౌంట్లను హ్యాకింగ్ చేసి డేటా ఉల్లంఘనకు పాల్పడినట్టుగా వాట్సాప్ అంతర్గత విచారణలో బయటపడింది. వాట్సాప్ అకౌంట్లపై స్పైవేర్ హ్యాకింగ్ టూల్ తో ఉల్లంఘనకు పాల్పడిన ఇజ్రాయెల్ సంస్థ NSO గ్రూపుపై వాట్సాప్ దావా వేసింది.
ఏప్రిల్ 29, 2019 నుంచి మే 10, 2019 మధ్యకాలంలో వాట్సాప్ యూజర్ల సెల్ ఫోన్ నెంబర్లను వాట్సాప్ సొంత సర్వర్ల నుంచి కనీసం 1,400 మంది యూజర్ల అకౌంట్లను హ్యాకింగ్ చేసి డేటా ఉల్లంఘనకు పాల్పడినందుకు సదరు సంస్థపై యూఎస్ ఫెడరల్ కోర్టులో వాట్సాప్ దావా వేసినట్టు పేర్కొంది. హ్యాకింగ్ కు గురైన వాట్సాప్ యూజర్లు అత్యధిక స్థాయిలో ఉన్నారని, వారిలో లండన్ ఆధారిత మానవ హక్కుల న్యాయవాదిపైనే హ్యాకర్లు ప్రధానంగా టార్గెట్ చేసినట్టు విచారణలో వెల్లడైంది.
వాట్సాప్ యూజర్ల అకౌంట్లను ఎవరూ హ్యాక్ చేశారనేదానిపై క్లారిటీ లేదు. కానీ, NSO సంస్థ మాత్రం.. ఈ స్పైవేర్ టూల్ ప్రత్యేకించి ప్రభుత్వ కస్టమర్ల కోసం విక్రయిస్తుంటామని తెలిపింది. యూనైడెట్ స్టేట్స్, యూనైడెట్ అరబ్ ఎమిరేట్స్, బహరెయిన్, మెక్సికో, పాకిస్థాన్, ఇండియాలోనే ఎక్కుమంది బాధిత యూజర్లు ఉన్నట్టు విచారణలో తేలింది. ఏయే దేశం నుంచి ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు అనేదానిపై స్పష్టత లేదు.