కరీంనగర్ లో కలప స్మగ్లర్లు : తెలంగాణ వీరప్పన్ కోసం డ్రోన్లు

  • Published By: madhu ,Published On : February 20, 2019 / 11:28 AM IST
కరీంనగర్ లో కలప స్మగ్లర్లు : తెలంగాణ వీరప్పన్ కోసం డ్రోన్లు

కలప స్మగ్లరు రూటు మార్చారు. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో కలప డంప్‌లను దాచి పెట్టి..అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో స్మగ్లర్లు ఇసుకలో కలప డంప్‌లను దాచి పెట్టారు. హై టెక్నాలజీ ఉపయోగించి చెక్ పెట్టారు పోలీసులు. తెలంగాణ వీరప్పన్‌గా పేరు గడించిన ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి అనుచరులని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

గోదావరి పరిహార ప్రాంతంలో కలప స్మగ్మింగ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు…కలప డంప్‌లను గుర్తించేందుకు హై టెక్నాలజీని ఉపయోగించారు పోలీసులు. డ్రోన్ల సహాయంతో ఆరెంద మానేరులో ఇసుకలో పాతిపెట్టిన కలప డంప్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరంతా ఎడ్ల శ్రీనివాస్ అనుచరులని పోలీసులు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న ఎడ్ల శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరికొన్ని కలప డంప్‌ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కలప దుంగల విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా. 

జియో ట్యాగింగ్..డ్రోన్ కెమెరాలు..గూగుల్ మ్యాప్‌ల సహాయంతో కలప డంప్‌లని గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే వారిని ఉపేక్షించేది లేదని…అడవులను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్మగ్లర్లకు ఎవరైనా పోలీసులు, ఇతరులు సహాయం చేస్తే వారిపై కూడా కఠిన చర్యలుంటాయన్నారు. 

జంగిల్ బచావో…జంగిల్ బడావో…అనే నినాదంతో అడవుల సంరక్షణకు నడుం బిగించారు ముఖ్యమంత్రి కేసీఆర్..అందుకనుగుణంగా పటిష్టమైన చర్యలు తీసుకొంటోంది సర్కార్. పలువురి ఆఫీసర్స్‌ని బదిలీ కూడా చేసింది. అయితే అడవిలో దర్జాగా యంత్రాలతో చెట్లను నరికి వేస్తున్నారు. అడవుల రక్షణ..చెట్ల నరికివేత వల్ల ఫారెస్టును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కలప చెట్లను నరికివేస్తూ..అక్రమంగా తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు అటవీ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అటవీ సంరక్షణకు రామగుండం పోలీసు కమిషనరేట్ పోలీసులు కృషి చేస్తున్నారు.