Chittoor Honour Killing
Chittoor Honour Killing : కూతుర్ని ప్రేమించాడనే కోపంతో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడ్ని యువతి తండ్రి దారుణంగా హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయిన యువకుడు శవమై తేలాడు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన దనశేఖర్(22) …అదే గ్రామానికి చెందిన శైలజ అనే యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
దనశేఖర్ బెంగుళూరులో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి ఆదృశ్యమయ్యాడు. కొడుకు కనపడకపోయే సరికి దనశేఖర్ తల్లితండ్రులు సోమవారం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో దనశేఖర్ ను యువతి తండ్రి బాలు హత్యచేసి సొంత పొలంలో పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. బాలును అదుపులోకి తీసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రదేశం నుంచి వెలికి తీశారు. దనశేఖర్ శరీరాన్ని నాలుగు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టినట్లు తెలిపాడు.
తన కూతురుతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవటంతోటే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాలు తెలిపాడు. దీంతో పోలీసులు పరువు హత్యగా భావించి వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.