Leopard Killed by Young Man
Leopard : సాధారణంగా పులి కనిపించగానే మనం ఏమి చేస్తాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని… కాళ్లకు పని చెప్పి పరుగు లంకించుకుంటాం. శక్తికి మించి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకుంటాం. కానీ ఉత్తరాఖండ్ లోని ఒక మేకలకాపరి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడి దాన్నిహతమార్చాడు. అతను చిరుతను ఎందుకు హతమార్చాడో తెలుసుకోవాలనుందా….. అయితే చదవండి.
ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ గడ్ జిల్లా నైనీ గ్రామానికి చెందిన నరేష్ సింగ్ మేకల కాపరి. రోజులాగానే బుధవారం కూడా మేకలను మేపేందుకు సమీపంలోని అడవికి తీసుకువెళ్లాడు. మేకలు అక్కడ తిరుగుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి మేకల మందపై దాడి చేసింది.
ఇది గమనించిన నరేష్ భయపడి పారిపోకుండా తన దగ్గర ఉన్న కర్రతో చిరుతను బెదర గొట్టేందుకు ప్రయత్నించాడు. చిరుత బెదరలేదు. నరేష్ వంక కోపంతో చూస్తూ దాడి చేసింది. కర్రను పక్కన పడేసిన నరేష్ ప్రాణ రక్షణ కోసం తన దగ్గర ఉన్న కొడవలితో చిరుతతో పోరాడాడు.
ఆ పోరాటంలో చిరుత మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆత్మరక్షణ కోసం చిరుతను చంపినందుక నరేష్ సింగ్ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.