Youtuber, Pubg Madan
Youtuber, Pubg Madan : మహిళలతో నిషేధిత పబ్జీ ఆడుతూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ.. ఆడియోలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన యూ ట్యూబర్, పబ్ జి గేమర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మదన్ దంపతులపై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. కృత్తిక,మదన్ దంపతులు నడుపుతున్న యూట్యూబ్ చానల్ కి సుమారు 18 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
తమిళనాడు ధర్మపురికి చెందిన మదన్ కుమార్ యూట్యూబ్ ద్వారా యువతులను ఆకర్షించేవాడు. వీరిలో ఎక్కు మంది మైనర్లే ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. సేలంలో ఇంజనీరింగ్ చదివిన మదన్ పబ్జీ గేమ్ ఆడుతూ పలువురు మహిళలను ఇందులోకి దింపాడు. ఈ క్రమంలో వారితో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వాటిని రికార్డు చేసి, ఆ మహిళలకు తెలియకుండా వాటిని యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసేవాడు. లక్షలాది మంది సబ్‌స్క్రైబర్స్ ఉండటంతో వాటి ద్వారా నెలకు సుమారు 3లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య కృత్తికతో కలిసి 10 యూ ట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది.
ఈ కేసులో మదనకు సహకరించిన అతడి స్నేహితుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు ఝూమున ధర్మపురిలో స్నేహితుని ఇంట్లో ఉన్న మదన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయానికి తరలించారు.
యూ ట్యూబ్ నిర్వాహకురాలైన అతని భార్య కృత్తికను ఇదివరకే చెన్నైలో అరెస్ట్ చేశారు. మదన్ కు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిలోని రూ.4 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. గడిచిన 3 ఏళ్లలో అతను రూ. 75 కోట్లు సంపాదించినట్లు అంచనా. వీటితో పాటు అతని వద్దనుంచి కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండు ఆడి కార్లు ఉన్నాయి.
కేసు విషయమై మదన్ తండ్రి మాణిక్యంను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన మదన్ చెన్నైలో స్ధిరపడ్డాడు. మదన్ తండ్రి చెన్నైలోని అంబత్తూరు వద్ద రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన కృత్తికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.
మదన్ పై సుమారు 150 కి పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. మదన్ తోజరిపిన సంభాషణలు యూ ట్యూబ్ లో బహిర్గతం కావటంతో కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పబ్జీమదన్ రాసలీలలపై పోలీసులు నిఘా పెట్టారు. అతనితో అసభ్యంగా మాట్లాడిన మహిళల జాబితాను పోలీసులు సేకరిస్తున్నారు. తనతో అసభ్యంగా మాట్లాడిన మహిళలకు రూ.5లక్షల వరకు ప్రోత్సాహక బహుమతులను కూడా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.