6 Common Resume Mistakes
Resume Tips : జాబ్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఉద్యోగం రావాలంటే ముందుగా మీ రెజ్యూమ్ సరిగా ఉందో లేదో చూసుకోండి. మీ రెజ్యూమ్ బట్టే మీకు ఉద్యోగం వస్తుందా లేదా డిసైడ్ చేయొచ్చు.
ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మంచి రెజ్యూమ్ లేదా బయోడేటా అనేది అత్యంత ముఖ్యం. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా అది సెకండరీ. మీరు ఇచ్చే రెజ్యూమ్‌లో మీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్ హిస్టరీ అనేవి ఎక్కువగా కీ రోల్ ప్లే చేస్తాయని అర్థం చేసుకోవాలి.
అందువల్ల, మీ రెజ్యూమ్‌ను ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటే అంత బెటర్ అనమాట.. సాధారణంగా చాలామంది రెజ్యూమ్ లో చేసే పొరపాట్లపై పెద్దగా అవగాహన ఉండదు. అవేంటో తప్పనిసరిగా గుర్తించాలి. మీ రెజ్యూమ్‌లో స్పెల్లింగ్, అక్షర దోషాలు ఉంటే మీ పని పట్ల అజాగ్రత్తగా ఉన్నారని, సీరియస్‌గా లేరని సూచిస్తుంది. రెజ్యూమ్ ప్రిపేర్ చేసే విషయంలో ఈ 6 విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మీకు జాబ్ రావడం పక్కా అని చెప్పవచ్చు.. ఇంతకీ అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
1. ఇమెయిల్ ఐడీ :
మీ ఇమెయిల్ ఐడీ చాలా ప్రొఫెషనల్‌గా ఉండాలి. మీ రెజ్యూమ్‌లో క్యూటీపీ, రాక్‌స్టార్ లేదా అలాంటి పదాలతో ఇమెయిల్ ఐడీని వాడొద్దు. మీ పేరుకు తగినట్టుగా చాలా సింపుల్‌గా ఉండాలి.
2. వ్యక్తిగత వివరాలపై ప్రాధాన్యత :
మీ ఎత్తు ఎంత, మీ బరువు ఎంత మొదలైన వాటి గురించి రెజ్యూమ్‌లో రాయొద్దు. వాటిపై మీ జాబ్ ఇచ్చే కంపెనీకి అవసరం లేదు. వయస్సు, మ్యారేజ్ స్టేటస్, మతం లేదా అలాంటి ఇతర సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ కూడా రెజ్యూమ్‌లో రాయొద్దు.
3. నెగటివ్ లాంగ్వేజ్ వాడొద్దు :
మీ రెజ్యూమ్‌లో ఎప్పుడూ పాజిటివ్ లాంగ్వేజీని మాత్రమే ఉపయోగించండి. ‘నేను విఫలమయ్యాను’ లేదా ‘నేను చేయలేకపోయాను’ వంటి నెగటివ్ సెంటెన్స్ అసలు ఉపయోగించవద్దు. వీటికి బదులుగా, మీ విజయాలతో పాటు అనుభవాలను రాయండి. అంతేకాదు.. గతంలో మీ పనికి సంబంధించిన ఏదైనా మంచి అనుభవం ఉంటే అది కూడా రాయొచ్చు.
4. అనవసరమైన ఫాంట్‌లు :
రెజ్యూమ్ చూడగానే చాలా సులభంగా చదవగలిగే ఫాంట్‌లను ఉపయోగించండి. టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్ లేదా కాలిబ్రి వంటి ఫాంట్‌లను ప్రొఫెషనల్‌గా పరిగణిస్తారు.
5. బాధ్యతలు వద్దు.. విజయాలు ముద్దు :
మీ మునుపటి ఉద్యోగంలో లేదా మీ ఇంటర్న్‌షిప్ సమయంలో మీరు నిర్వర్తించిన బాధ్యతలను వివరించవద్దు. కానీ, మీ విజయాలను కూడా ప్రస్తావించండి. మీరు ఏమేమి సాధించారో ఉదాహరణలతో వివరించండి. ఉదాహరణలతో మీ సామర్థ్యాలను ఒక్కొక్కటిగా ప్రస్తావించండి.
6. కంటెంట్ లాంగ్ ఉండొద్దు :
మీ రెజ్యూమ్ చాలా సింపుల్ అండ్ క్లీన్‌గా కనిపించాలి. చదవేందుకు సులభంగా ఉండేలా హెడ్డింగ్‌లు, బుల్లెట్ పాయింట్‌లు, ఖాళీ స్థలాన్ని ఉపయోగించండి. మీ రెజ్యూమ్ ఎప్పుడూ చాలా లాంగ్ ఉండకూడదు. సాధారణంగా ఒకటి లేదా రెండు పేజీల రెజ్యూమ్ సరిపోతుంది. ప్రత్యేకించి మీకు తక్కువ అనుభవం ఉన్న సందర్భాల్లో ఇలా ఉంటే మంచిది.
మీ రెజ్యూమ్ గురించి మీకు ఏమైనా సందేహంగా అనిపిస్తే.. అది ఎలా ఉందో చూడమని మీ స్నేహితులను లేదా వర్క్ కొలిగ్స్‌ను అడగండి. లేదంటే.. ఆన్‌లైన్‌లో మంచి ప్రొఫెషనల్ రెజ్యూమ్ అందించే ఎన్నో వెబ్ సైట్లు ఉన్నాయి. అందులో మీరు Adobe Express, Resume.com, MyPerfectResume, Resume Genius, Enhancv వంటి ఫ్రీ ఆన్‌లైన్ రెజ్యూమ్ బిల్డర్ టూల్స్ సాయం తీసుకోవచ్చు.