Telangana Model Schools
తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఇంతకు ముందు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకుడు శ్రీనివాసా చారి చెప్పారు.
మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటివరకు మొత్తం 25,921 దరఖాస్తులు వచ్చాయి.
ఏపీలో నోటిఫికేషన్ విడుదల
మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిచేందుకు మార్చి 31 తుది గడువు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే విద్యార్థులు ఏప్రిల్ 20న పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మెరిట్ జాబితా ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లు ఇస్తారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్టు విడుదల అవుతుంది. అదే నెల 30న సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ స్కూళ్లలో ఆరో తరగతిలో చేరితే ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అభ్యసించవచ్చు.
www.cse.ap.gov.in లేదా www.apms.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలనుకునే ఓసీ, బీసీ విద్యార్థులు 2018, సెప్టెంబరు 1- 2015, ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.