ఇంటర్మీడియట్ అయిపోగానే విద్యార్థులు ఏయే కోర్సుల్లో చేరాలన్న హడావుడిలో ఉంటారు. కొందరికి వైద్య రంగంలో, మరికొందరికి ఇంజనీరింగ్‌లో ఆసక్తి ఉంటుంది. ఇవేగాక అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిగ్రీలతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. ఈ కోర్సులపై విద్యార్థులకు అవగాహన ఉండాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు అధికంగా ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరతారు. చాలా మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో ఇష్టం లేకుండానే తల్లిదండ్రుల ఒత్తిడిలో చేరతారు. ఇంటర్ తర్వాత ఇటువంటి కోర్సులు వద్దనుకునే వారికి ఇతర అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తిని బట్టి ఆయా కోర్సుల్లో చేరవచ్చు.
Also Read: ఇంటర్ రిజల్ట్స్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవచ్చు.. వెబ్ సైట్ల వివరాలు..
ఎంపీసీ అనంతరం విద్యార్థులు ఇంజినీరింగ్ చేయొచ్చు. అలాగే, బీఎస్, బీఎస్‌ఎంఎస్, బీఎస్సీ వంటి కోర్సులు ఉన్నాయి. అంతేగాక, ఆర్మీ/ నేవీల్లో 10+2 టెక్నికల్ ఎంట్రీ వంటి వాటిలో కూడా చేరవచ్చు.
బైపీసీ చేసిన విద్యార్థులు మెడిసిన్‌లో చేరవచ్చు. అంటే, ఎంబీబీఎస్/బీఏఎంఎస్/బీహెచ్‌ఎంఎస్/బీడీఎస్‌లో చేరవచ్చు. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీలోనూ చేరే అవకాశం ఉంది. బీఎస్సీలో చేరానుకునే విద్యార్థులు కూడా చాలా మంది ఉంటారు. అలాగే, పారా మెడికల్ కోర్సులు, బీఎస్-ఎంఎస్ వంటి కోర్సుల్లోనూ చేరవచ్చు.
ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇలా ఏ కోర్పు చదివినా ఆ తర్వాత లా/లిబరల్ స్టడీస్/డీఎడ్/ఇంటిగ్రేటెడ్ బీఎడ్సీ/సీఏ/సీఎంఏ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ఆర్మీ ఎన్‌డీఏలోనూ జాయిన్ కావచ్చు.
డైలీ కాలేజీకి వెళ్లే అవసరం లేకుండా దూరవిద్యలోనూ చదువుకునే అవకాశం ఉంది. ఇగ్నోతో పాటు బీఆర్‌ఏఓయూలో చేరవచ్చు.
న్యాయవిద్య అభ్యసించాలనుకునే వారు లాసెట్ లేదా క్లాట్, ఎల్‌శాట్ వంటి పరీక్షలు రాయాలి.
ఫైన్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న వారు పెయింటింగ్/ఫొటోగ్రఫీ/యానిమేషన్/అప్లైడ్ ఆర్ట్స్/స్కల్ప్‌చర్ వంటి కోర్సుల్లో చేరవచ్చు.