APPSC Group 2 Mains Exam : గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 మెయిన్స్ ఇనిషియల్ కీ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in లో కీ చూసుకోవచ్చని ఏపీసీఎస్సీ తెలిపింది. అభ్యర్థులకు ఏవైనా ప్రశ్నలు, కీ పై ఎలాంటి సందేహాలు ఉన్నా ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలను తెలపొచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది.
ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా పూర్తైందని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న వారు 86,459 మంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వారిలో 79 వేల 599 మంది పరీక్షకు హాజరైనట్టు కమిషన్ తెలిపింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాసిన వారు 92 శాతం అని ఏపీపీఎస్సీ సెక్రటరీ నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.
గ్రూప్ 2 ఎగ్జామ్ కి ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాకే పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. అటు, అభ్యర్థుల విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. 23న నిర్వహించాల్సిన పరీక్షను కొద్దిరోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీకి లేఖ రాసింది.
Also Read : యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. కట్ ఆఫ్ పీడీఎఫ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అటు రోస్టర్ అంశం కోర్టులో ఉందని, మార్చి 11న మరోమారు విచారణ జరగనుందని, అప్పటిదాకా పరీక్షలు నిర్వహించొద్దని లేఖలో కోరింది ప్రభుత్వం. అయితే, పరీక్షలు వాయిదా వేసేందుకు ఏపీపీఎస్సీ ఒప్పుకోలేదు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయలేము అని కమిషన్ తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించింది.
ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ పేపర్-1 నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష పెట్టారు. పరీక్ష కేంద్రానికి 15 నిమిషాల ముందే చేరుకోవాలని అభ్యర్థులకు కమిషన్ ముందుగానే సూచించింది. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో.. అధికారులు వారిని వెనక్కి పంపేశారు.