UPSC Topper Aditya Srivastava : ‘కష్టపడితే.. ఒకరోజు కలలు నిజమవుతాయి’.. యూపీఎస్సీ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ రియాక్షన్..!

UPSC Topper Aditya Srivastava : ‘ఏళ్ల తరబడి కష్టపడితే ఏదో ఒకరోజు నిన్ను విజయం వరిస్తుంది’ అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. మరో పోస్టులో ‘కలలు నిజమవుతాయి’ అని పేర్కొన్నాడు.

UPSC Topper Aditya Srivastava : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలను ప్రకటించింది. మొత్తం 1,016 మంది అభ్యర్థుల నియామకానికి పరీక్షను నిర్వహించింది. ఈ యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించాడు. ఫలితాల అనంతరం లక్నోకు చెందిన శ్రీవాస్తవ మొదటిసారిగా ట్విట్టర్ (X) వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. యూపీఎస్సీ ఫలితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు.

Read Also : UPSC Result 2023: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

‘ఏళ్ల తరబడి కష్టపడితే ఏదో ఒకరోజు నిన్ను విజయం వరిస్తుంది’ అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. మరో పోస్టులో ‘కలలు నిజమవుతాయి’ అని పేర్కొన్నాడు. యూపీఎస్సీ ప్రయాణం అంతటా తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ ఫలితాన్ని జీవితాంతం ఆనందిస్తాను. కలలు నిజమవుతాయి అంటే ఇదేనని అని శ్రీవాస్తవ తాను జ్యూస్ తాగుతున్న ఫొటోను కూడా షేర్ చేశారు. టాప్ ర్యాంకర్ గా నిలిచిన శ్రీవాస్తవకు సోషల్ మీడియి వేదికగా అభినందలు తెలియజేస్తున్నారు. యూపీఎస్సీలో విజయం కోసం అతడు చేసిన ప్రయత్నాలను అభినందించారు.

తొలి ప్రయత్నం విఫలం.. మూడోసారి టాప్ ర్యాంక్ :
కార్పొరేట్‌ జాబ్ పక్కనపెట్టేసి యూపీఎస్సీ కోసం ప్రయత్నించగా మొదటిసారి ఫెయిల్ అయ్యాడు. అయినా వదల్లేదు. మళ్లీ మూడో ప్రయత్నంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో శ్రీవాస్తవ డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ గోల్డ్‌మన్‌ శాక్స్‌లో ఉద్యోగం సంపాదించాడు. 2019లో కార్పొరేట్ జాబ్ చేసిన శ్రీవాస్తవ లక్షల్లో జీతాన్ని వదిలేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. ఎలాంటి కోచింగ్ తీసుకుండా తనకు తానే ప్లానింగ్ వేసుకుని ప్రిపేర్ అయ్యాడు.

2021లో మొదటి ప్రయత్నంగా యూపీఎస్సీ రాయగా విఫలమయ్యాడు. ప్రిలిమ్స్ కూడా పూర్తి చేయలేకపోయాడు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. 2022లో మొదటిసారి యూపీఎస్సీలో విజయవంతమయ్యాడు. అదే ఏడాది యూపీఎస్సీలో 236వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. 2023లో మూడోసారి సివిల్స్‌ రాసి టాప్ ర్యాంకు సాధించాడు. పాత మోడల్ పేపర్లు, సిలబస్‌ ఫాలో అవ్వడం వల్లే తాను యూపీఎస్సీలో విజయం సాధించానని శ్రీవాస్తవ చెప్పుకొచ్చాడు.

టాప్ 10లో నిలిచింది వీరే :
మరోవైపు.. యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో అనిమేష్ ప్రధాన్, డోనూరు అనన్యారెడ్డి వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. టాప్ 10లో పీకే, సిద్ధార్థ్ రామ్‌కుమార్, రుహాని, సృష్టి దాబాస్, అన్మోల్ రాథోడ్, ఆశిష్ కుమార్, నౌషీన్ ఐశ్వర్యం ప్రజాపతి నిలిచారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 2023లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నిర్వహించగా.. జనవరి నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన పర్సనాలిటీ టెస్ట్‌కు ఇంటర్వ్యూల ఫలితాల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల అయింది. ఈ జాబితాలో (1) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌, (2) ఇండియన్ ఫారిన్ సర్వీస్, (3) ఇండియన్ పోలీస్ సర్వీస్, (4) సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ‘ఎ’ మరియు గ్రూప్ ‘బి’ అభ్యర్థులు ఉన్నారు.

సీఎస్ఈ (మెయిన్స్) సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబరు 24 వరకు రెండు షిఫ్ట్‌లలో సబ్జెక్టివ్ ఫార్మాట్‌లో జరిగింది. ప్రతి షిఫ్ట్, 3 గంటల పాటు ఉదయం, 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. మొదటి 25 మంది అభ్యర్థుల్లో ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో విద్యార్హతలు పొందినవారే ఉన్నారు. దేశంలోని ప్రముఖ సంస్థలైన ఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, నేషనల్ లా యూనివర్శిటీ నుంచి లా కోర్సు గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నాయి.

Read Also : UPSC Aspirants : తప్పుదారి పట్టించే ‘యూపీఎస్సీ స్టడీ ప్రిపరేషన్’ బ్లాగ్స్‌‌కు దూరంగా ఉండండి : ఐఏఎస్ అధికారి సూచన

ట్రెండింగ్ వార్తలు