పోలీసు ఉద్యోగంలో ఉంటే పెళ్లి కావట్లేదని ఉద్యోగాన్నే వదులుకున్నాడు ఓ కానిస్టేబులు.. వివరాల్లోకి వెళితే హైదరాబాద్, చార్మినార్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేసే సిధ్ధాంతి ప్రతాప్ బీ.టెక్ చదివాడు. పోలీసు శాఖపై అభిమానంతో పరీక్షలు రాసి 2014 లో పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాడు.
ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకు పెళ్లి చేసుకోదలిచి సంబంధాలు చూడమని మధ్యవర్తులను సంప్రదించాడు. కొన్ని సంబంధాలు చూడగా… పోలీసు కానిస్టేబుల్ అంటే 24 గంటలు డ్యూటీలో ఉండాలి… కానిస్టేబుల్ అయితే ఎదుగు బోదుగులేని జీవితం.. అలాంటి సంబంధం వద్దని ఒక యువతి తిరస్కరించిందని మధ్యవర్తి ప్రతాప్ కు వివరించాడు.
దీంతో తన ఉద్యోగ బాధ్యతలు, ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి, తన సీనియర్లను పరిశీలించిన ప్రతాప్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు 2019, సెప్టెంబరు 7 న లేఖ రాశాడు. అప్పట్లో ఆ లేఖ కలకలం రేపింది. ఓ దశలో తన రాజీనామాపై పునరాలోచిస్తానని చెప్పినా రాజీనామా చేయటానకే మొగ్గు చూపాడు. చివరికి ప్రతాప్ రాజీనామా లేఖను పరిశీలించిన పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ సోమవారం నవంబర్ 4న ఆమోదించారు.