Employee Variable Pay : ఐటీ ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు.. జీతాలు తగ్గిస్తున్నకంపెనీలు
జీతాలు తగ్గించేస్తూ.. ఐటీ ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి కంపెనీలు..

Employee Variable Pay
Employee Variable Pay : సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఐటీ జాబ్ కొడితే జీతానికి, జీవితానికి ఢోకా ఉండదు అనే మాట.. ఇప్పుడు కాస్త సౌండ్ తగ్గించి చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. విప్రో, టీసీఎస్.. ఇప్పుడు ఇన్ఫోసిస్.. ఉద్యోగులకు ఝలక్ ఇచ్చాయ్. ఇంతకీ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి.. అద్భుతహా అనిపించే సాఫ్ట్‌వేర్ జీవితాలపై కొత్త వచ్చి పడుతున్న కష్టం ఏంటి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. వేల మంది యువకుల కల ! జీతాలు, జీవితాలు కూడా అలానే ఉంటాయ్. ఐదు రోజుల పని.. ఆరంభంలోనే ఐదు అంకెల జీతం.. వీకెండ్ ఫన్, కుదిరితే ఫారిన్ ట్రిప్.. ఇలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఎన్నో కలలు చాలామందికి ! ఐదు రోజుల వర్క్‌లో అంతో ఇంతో ఒత్తిడి ఉన్నా.. మిగిలిన రెండు రోజులు రీచార్జ్ కావొచ్చు. అందుకే సాఫ్ట్‌వేర్ కంపెనీ ట్యాగ్ వేసుకోవాలని కష్టపడుతుంటారు. పైగా లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చుని పని చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నా చేతిలో ల్యాప్‌టాప్ ఉంటే చాలు పని చేసుకునే అవకాశం ఉంది. పైగా భారీ ప్యాకేజ్‌లు.. ఇక్రిమెంట్లు.. ఆఫర్లు.. అందుకే.. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరిగింది. కానీ.. ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు కొత్తగా కష్టాలు తప్పేలా లేవ్. వారికి వారు చేజేతులా తీసుకొచ్చుకొని.. మోయాల్సిన కష్టాలు ఇవి ! ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయ్. ఆ సంస్థలు తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగుల జేబుల మీద ప్రభావం పడుతోంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తే చాలు.. పర్ఫార్మెన్స్ పేలు, ఇంక్రిమెంట్లు భారీగా ఉంటాయనుకోవడం ఒకప్పటి మాట. ఐతే ఇప్పుడు కంపెనీలు వరుసగా ఉద్యోగులకు ఝలక్ ఇస్తున్నాయ్. అట్రిషన్ రేటుతో భారీ వేతనాలు ఆఫర్ చేసే సంస్థలు ఇప్పుడు వేరియబుల్ పేను ఆలస్యం చేస్తున్నాయ్. మరికొన్ని పర్సంటేజీ తగ్గిస్తున్నాయ్. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వేరియబుల్ పేను 70శాతానికి తగ్గించింది. వేరియబుల్ పే అంటే.. ఉద్యోగి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇచ్చే జీతం అన్నమాట. ఇన్ఫీలో ఒకప్పుడు భారీగా ఉండేది ఇది. అలాంటిది ఇస్తామన్న దానిలో 70శాతమే ఈసారికి పరిమితం చేసింది. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం, లాభదాయకత, మార్జిన్లు తగ్గడమే దీనికి కారణాలుగా కనిపిస్తోంది.
ఇన్ఫోసిస్ మాత్రమే కాదు.. విప్రో సంస్థ కూడా కొందరు ఉద్యోగుల వేరియబుల్ పేను నిలిపివేసింది ఈ మధ్యే ! మార్జిన్లపై ఒత్తిడి, టాలెంట్ సరఫరా సైకిల్‌లో సామర్థ్యం లేకపోవడం, టెక్నాలజీలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి రావడమే ఇందుకు కారణాలు అని వివరణ ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ అయితే.. క్వార్టర్లీ వేరియబుల్ పేను కొందరు ఉద్యోగులకు నెల రోజులు ఆలస్యం చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ అదే బాటలో నడిచింది. 2023 ఆర్థిక ఏడాది, తొలి త్రైమాసికంలో వేరియబుల్ పే ఔట్‌ను 70శాతానికి కుదించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు మెయిల్ చేసి మరీ చెప్పింది..
జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచనాలు అందుకోలేదు. ఖర్చులు ఎక్కువ కావడంతో.. నికర లాభం కేవలం 3.2 శాతమే పెరిగింది. ఇది కంపెనీ అంచనా వేసిన దానికంటే చాలా తక్కువ ! అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఆందోళనలు.. ఐటీ కంపెనీల ఇబ్బందులను పెంచుతున్నాయ్. ఇది వేరియబుల్ పేలు తగ్గించడానికి మాత్రమే పరిమితం కాలేదు. జీతాల పెంపు విషయంలోనూ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయ్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో గత మూడు నెలల్లో దాదాపు 25 నుంచి 50శాతం వరకు జీతాల పెంపు పడిపోయింది. కొత్తగా ఉద్యోగంలో తీసుకున్న వారికి 40 నుంచి 50శాతం జీతాలు పెంచేవారు. అది కూడా ఇప్పుడు 20 నుంచి 25 శాతానికి పడిపోయింది.
ఆర్థిక మందగమన భయాల కారణంగా అతిపెద్ద గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా ఉద్యోగ నియామకాలు నిలిపివేయగా, ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయ్. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల సంగతి ఎలా ఉన్నా.. ఇండియన్ ఐటీ కంపెనీలు మాత్రం.. కాస్ట్ కటింగ్ మీద దృష్టిసారిస్తున్నాయ్. ఇలా ఎలా చూసినా.. ఉద్యోగుల జీతాలపై భారీ ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఎవరినైనా రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటే.. ఎంత ప్యాకేజీ అయిన పర్లేదు అని మేనేజర్లకు సూచించే సంస్థలే ఇప్పుడు.. ఇప్పుడు ఇంతే కావాలి.. ఇంతలోనే కావాలని నిబంధనలు విధిస్తున్నాయ్. ఇదే పరిస్థితి ఇకపై కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.