షాకింగ్ : ఇన్ఫోసిస్ లో త్వరలో ఉద్యోగుల తొలగింపు

  • Publish Date - November 5, 2019 / 06:51 AM IST

ఐటీ సేవల సంస్ధ కాగ్నిజెంట్‌ బాటలోనే దేశీ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కూడా ఉద్యోగులను తొలిగించే పనిలో పడింది.  కాగ్నిజెంట్ ఉద్యోగులను తొలగించబోతోందనే వార్త వెలువడి వారం రోజులు కాకముందే ఇన్ఫోసిస్ లో  పెద్దసంఖ్యలో ఎగువ శ్రేణి ఉద్యోగులను ఇంటికి పంపాలని యోచిస్తోందని ఒక ఆంగ్ల దినపత్రిక కధనం ప్రచురించింది.

దాదాపు 2200 మంది సీనియర్‌ మేనేజర్లను సాగనంపాలని కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం. జూనియర్‌, మిడిల్‌ లెవెల్‌ అసోసియేట్లను సైతం 2 నుంచి 5 శాతం వరకూ తొలగించవచ్చని  ఆంగ్ల దినపత్రిక కథనంలో వెల్లడించింది. మరోవైపు అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ వంటి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల్లో 50 మంది వరకూ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని కోరనుందని  తెలుస్తోంది.

గతంలో  ఉద్యోగుల పని సామర్ధ్యం ఆధారంగా తొలగించే ఇన్ఫోసిస్‌ ఈసారి భారీ సంఖ్యలో సిబ్బందిపై వేటు వేయడం అసాధారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆటోమేషన్‌ రాకతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు.