రైలు కారణంగా నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు గుడ్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 04:32 AM IST
రైలు కారణంగా నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు గుడ్ న్యూస్

Updated On : May 7, 2019 / 4:32 AM IST

కేంద్రం దిగివచ్చింది. నీట్ బాధితులపై కరుణ చూపింది. వారికి మరో ఛాన్స్ ఇచ్చింది. హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం కారణంగా ‘నీట్’ను రాయలేకపోయిన కర్ణాటక విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయిన 500మంది విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. మే 20న వారికి పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఫొని తుపాను కారణంగా వాయిదా పడిన ఒడిశాలోనూ అదే రోజున పరీక్ష నిర్వహిస్తామన్నారు.
 
ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం ఆదివారం (మే 5,2019) దేశ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష జరిగింది. 13 లక్షల మంది హాజరయ్యారు. హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం కావడంతో 500మంది విద్యార్థులు బెంగళూరులోని పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. హంపి ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 7.30 గంటలకు బెంగుళూరు చేరుకోవాల్సి ఉండగా, 6 గంటల ఆలస్యంతో అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంది. రైల్వే శాఖ అధికారుల అలసత్వానికి 500మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు.

దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయంగానూ దుమారం రేగింది. రైలు ఆలస్యం కారణంగా వందలాది మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య.. ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. దీంతో దిగివచ్చిన కేంద్రం మరోసారి పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది.