Kirubhashini Jayakumar: తపన ఉండాలే గానీ సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నారు తమిళనాడుకు చెందిన కిరుభాషిణి జయకుమార్. ఈమె ప్రత్యేకత ఏమిటంటే 15 భాషలను చదవగలరు, మాట్లాడగలరు. అంతేకాదు రాయగలరు కూడా. మరిన్ని భాషలు నేర్చుకుని గిన్నిస్ బుక్ లో స్థానమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారామె.
కోయంబత్తూరు జిల్లా రామనాథపురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల కిరుభాషిణి ఎంఏ వరకు చదివారు. 8వ ఏట నుంచే కొత్త భాషలను నేర్చుకోవాలనే తపన కనబరిచారు. ఆమె అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించడంతో 15 భాషలను నేర్చుకోగలిగారు. ఒక భాషను నేర్చుకోవడానికి తనకు 3 నెలల సమయం పడుతుందని ఆమె చెప్పారు. కొత్త భాషలను నేర్చకోవడం కోసం అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్లానని వెల్లడించారు.
వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన 15 భాషల్లో కిరుభాషిణి అనర్గళంగా మాట్లాడగలరు, రాయగలరు. తమిళం, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, జపనీస్, టర్కిష్, అరబిక్ భాషల్లో ఆమె పట్టుంది. కిరుభా స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ పేరుతో శిక్షణ సంస్థ నడుపుతున్నారు. అంకిత భావంతో రోజూ ప్రాక్టీస్ చేస్తే సులువుగా ఇతర భాషలు నేర్చుకోవచ్చని చెప్పారామె.
20 భాషలు.. గిన్నిస్ రికార్డ్ లక్ష్యం
తనకు 30 ఏళ్లు వచ్చేసరికి 20 భాషలపై పట్టు సాధించి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూస్ 18తో చెప్పారు కిరుభాషిణి. కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే పిల్లలకు ఉచితంగా బోధిస్తానని తెలిపారు. మనదేశంలో ఎక్కువ భాషలు మాట్లాడేవారు చాలా మంది ఉన్నప్పటికీ.. 15 రకాల భాషలను అనర్గళంగా మాట్లాడడం, రాయడం, చదవడం చేయగల ప్రతిభ కారణంగా కిరుభాషిణి ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.
Also Read: మరో అంతర్జాతీయ సంస్థకు అధిపతిగా భారత సంతతి వ్యక్తి.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్
ఆ భాషలు నేర్చుకోవడం ఈజీ
జర్మన్ భాష.. ఇంగ్లీషుకు దగ్గరగా ఉంటుందని కిరుభాషిణి వెల్లడించారు. హిందీ, యూరోపియన్ భాషలు నేర్చుకోవడం సులభమని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్, జేకే రౌలింగ్ నుంచి స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. తన సొంత భాష తమిళంలో పుస్తకాలు రాసి, ప్రచురించాలని ఉందని మనసులోని మాటను పంచుకున్నారు. ఇతర భాషల్లో నవలలు రాయాలని ఉందన్నారు.