Andhra University
Andhra University : సాగర తీరం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి దేశంలోనే అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. అత్యున్నత వసతులు, విద్యా ప్రమాణాలు పాటిస్తూ విద్యనందిస్తున్న నేపధ్యంలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) a++ గ్రేడ్ ప్రకటించింది. నాక్ సభ్యుల బృందం ఏయూలోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ను మంజూరు చేసింది.
దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కోర్సులు, బోధన, సౌకర్యాలు, కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు మాత్రమే ఈ గ్రేడ్ ను దక్కించుకోగా తాజాగా ఈ గ్రేడ్‌ను ఏయూ సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగళూరు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు దక్కించుకోగా ప్రస్తుతం అదే స్కోరు ఆంధ్రా యూనివర్సిటీకి దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకూ వర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ కొనసాగనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.
యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కుల జాబితాలను అందించే విధానం కాకుండా.. విద్యార్థి అభివృద్ధికి, వారి భవిష్యత్తు మార్గదర్శిగా, పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారింది. విదేశాలకు చెందిన యూనివర్సిటీలు, సంస్థలతో ఒప్పందాలు చేసుకుని పరస్పర సహకారం అందిపుచ్చుకుంటుంది.
నవంబర్ 4, 5, 6 తేదీలలో ఏయూలో నాక్ బృందం పర్యటించి వర్సిటీలో మౌలిక వసతులు, బోధన తదితర అంశాలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, యోగా, సైకాలజీ, స్పోర్ట్స్ విభాగాలతో పాటు విభిన్న విభాగాలను ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు 4.0 స్కేల్ పై 3.74 స్కోర్‌ను అందించి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ప్రకటించారు.
ఇంజనీరింగ్‌తో సమానంగా సైన్స్,ఆర్ట్స్ కోర్సులను ఉపాధి కల్పించేవిగా తీర్చిదిద్దారు. విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు తోడ్పడేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకువచ్చారు. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థీ ఉన్నత స్ధాయిలో ఉపాధి పొందేలా విద్యా ప్రణాళికలను రూపొందించటంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
READ ALSO : Assembly Elections 2023: ఓబీసీ కోటాపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
అంతేకాకుండా ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ 100 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసింది. యూనివర్శిటీలోని స్టార్టప్ సెంటర్‌లో 150 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయని చెప్పాలి. విశ్వవిద్యాలయం ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించటం పట్ల యూనివర్శిటీ వర్గాలు,వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్టార్ జేమ్స్ స్టీఫెన్‌తోపాటుగా విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏయూలో ప్రస్తుతం కోర్సులకు సంబంధించి యూజీ ప్రోగ్రామ్స్ – 36, పీజీ ప్రోగ్రామ్స్ – 118, పీహెచ్‌డీ -57, పీజీ డిప్లామా – 03, డిప్లామా – 08, సర్టిఫికెట్/అవేర్‌నెస్ – 03, ప్రోగ్రామ్స్ ఉండగా , టీచింగ్ స్టాఫ్ – 538 మంది, నాన్ టీచింగ్ స్టాఫ్ – 2,270 మంది, విద్యార్ధులు 10338 ఉన్నారు.