NEET PG 2025: నీట్‌ పీజీ 2025 తేదీ మారిందా? క్లారిటీ ఇచ్చేసిన పీఐబీ

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం బెడద చాలా కాలంగా ఉంది.

నీట్ పీజీ 2025 తేదీ మారిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఓ నకిలీ సర్క్యూలర్‌ వైరల్ అవుతోంది. అందులో నీట్‌ పీజీ 2025ను ఆగస్టు 17 వరకు పరీక్షను వాయిదా వేసినట్లు ఉంది.

ఈ విషయాన్ని గుర్తించిన పీఐబీ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. నీట్‌ పీజీ 2025 గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అభ్యర్థులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం natboard.edu.in మాత్రమే చూడాలని చెప్పింది.

Also Read: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఏది? టాప్ బ్యాటర్‌, బౌలర్ ఎవరు?

కాగా, నీట్ పీజీ 2025ని ఈ ఏడాది జూన్ 15న రెండు షిఫ్టులలో నిర్వహించనున్నట్లు గతంలోనే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ తెలిపింది. నీట్ పీజీ అనేది ఎండీ, ఎమ్మెస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం బెడద చాలా కాలంగా ఉంది. విద్యార్థులకు సంబంధించిన పరీక్షల సమాచారంపై కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు వస్తున్నాయి. దీంతో అది నిజమేనా? కాదా? అన్న ఆందోళనకు గురవుతున్నారు విద్యార్థులు.