విద్యార్థుల జీవితం కేవలం చదవటం, పరీక్షలు రాయటం మాత్రమే కాదు. వారు ఎంతో ఒత్తిడిని, భయాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. బంధువులు హేళన చేస్తారని, స్నేహితుల మధ్య పోటీ ఎక్కువ ఉందని, కెరీర్ పరంగా ముందుకు పోవాలని, తల్లిదండ్రులు చదవలనే ఒత్తిడి తేవడం – వీటివల్ల విద్యార్థులు ఎంతో ఒత్తిడి కి గురి అవ్వడమే కాకుండా వారిని మానసికంగా ప్రభావితం కూడా చేస్తున్నాయి.
ఈ ఒత్తిడి వల్ల కొంతమంది స్టూడెంట్స్ భయపడుతారు, మరికొంతమంది నిరుత్సాహానికి లోనయ్యి తక్కువ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఈ టైం లో తల్లిదండ్రులు, టీచర్స్ వారి భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికీ కాన్ఫిడెన్స్ నింపాలి. ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ సంస్థ రెండు రోజుల క్రితం ఢిల్లీ లో విద్యార్థుల మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసి స్టూడెంట్స్ లో ఎనలేని ధైర్యాన్ని నింపింది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’ రెండవ ఎపిసోడ్ లో పాల్గొని మానసిక ఆరోగ్యం, ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలి లాంటి అంశాలపై విద్యార్థులకు ఆమె కీలక సలహాలిచ్చింది. స్కూల్ లో ఉన్నపుడే స్పోర్ట్స్ పై ఎక్కువ ఆసక్తి ఉండేదని, ఆ తరువాత మోడలింగ్, నటన వైపు తన దృష్టి మళ్లిందని దీపికా తెలిపింది. లైఫ్ లో ఎన్నో చేంజెస్ చూశానని, ఎప్పుడూ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోలేదని.. తనకు తాను మోటివేట్ చేసుకుంటూ ఒత్తిడిని అధిగమించానని తెలిపింది. అంతేగాక ఒత్తిడి అనేది కంటికి కన్పించదని, జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుందని ఈ సమస్యతో బాధపడేవారు చాలామందే ఉంటారు. అందుకే రాయడం అలవర్చుకోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చింది.
విద్యార్థులకి ధైర్యాన్ని, భరోసాను నింపడమే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ఇపుడు తల్లిదండ్రులు, టీచర్స్ మీ బాధ్యత ఏంటి అంటే..?
1) స్టూడెంట్స్ ఏమి అనుభవిస్తున్నారో, వాళ్ల మనసులో ఏముంది అనేది తెలుకోవడానికి వారు చెప్పే మాటలు ఓపిగ్గా వినండి. “నేను నీతో ఉన్నాను” అనే భరోసా చెబితే వారిలో ధైర్యాన్ని పెంచుతుంది.
2) స్టూడెంట్స్ చిన్న విజయాలు అయినా సరే వాటిని గుర్తించి, ప్రోత్సహించాలి. చిన్న చూపు చూడకుండా అపారమైన ధైర్యాన్ని నింపాలి. అంతే కాక ఇతర స్టూడెంట్స్ తో ఎప్పుడు కూడా పోల్చకండి.
3) ఫెయిల్యూర్ కూడా మంచిదేనని, అది కొత్త అవకాశాలకు దారి చూపిస్తుందని వారికి తెలియజేయాలి.
4) మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా, ఆటలు, సృజనాత్మక పనులను అలవాటు చేయించాలి.
5) నువ్వు సాధించగలవు.. నీ బలాన్ని గుర్తించలేకపోతున్నావు.. తప్పకుండా సాధించగలవు అంటూ తన శక్తిని గుర్తు చేయాలి.
6) ప్రపంచంలో ఏది తొందరగా రాదు.. కానీ నీలో ధైర్యం, నమ్మకం ఉంటే, నీవు ఎక్కడికైనా వెళ్లగలవు, ఏదైనా సాధించగలవు అంటూ ధైర్యాన్ని నింపాలి
విద్యార్థులు బలహీనులు కాదు, వారు భవిష్యత్తుని తీర్చిదిద్దే శక్తివంతమైన వ్యక్తులు. వారికి మనం అండగా ఉంటే, ప్రేమతో, ఆదరణతో వారిని నడిపిస్తే – వారు జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనగలరు. మన మాటల్లో ప్రేమ, మన చేతల్లో నమ్మకం ఉంటే, వారు ముందుకు సాగడానికి వెనుకాడరు.