అన్ని బోర్డుల పరిధిలోని స్కూళ్లలో తొమ్మిది, పదో తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి.. ఫుల్‌ డీటెయిల్స్‌

రానున్న విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది.

తెలంగాణలో అన్ని బోర్డుల పరిధిలోని స్కూళ్లలో తొమ్మిది, పదో తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీంతో సీబీఎస్‌ఈతో పాటు ఐసీఎస్‌ఈ, ఐబీ, ఇతర అన్ని బోర్డుల్లోనూ ఆయా తరగతుల్లో తెలుగు సబ్జెక్టును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సిందే.

ఇందుకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర సర్కారు 2018, మార్చి 30నే చట్టం చేసిన విషయం తెలిసిందే. 2018లోనే జూన్‌లో జీవో 15 జారీ అయింది.

CBSE exams: ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో..

పలు బోర్డుల పరిధిలోని స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకే తెలుగును ఓ సబ్జెక్టుగా అమలు చేస్తున్నారు. త్రిభాషా సూత్రం ప్రకారం ఇంగ్లిష్, హిందీ, తెలుగును అమలు చేస్తున్నారు. ఆ తర్వాత తొమ్మిది, పదో తరగతుల్లో రెండు భాషా సబ్జెక్టులే ఉంటున్నాయి. ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటూ, మరో సబ్జెక్టుగా హిందీ లేదా ఇతర ఓ భాష ఉంటోంది.

ఇకపై మాత్రం ద్వితీయ భాషగా మన మాతృభాష తెలుగును తప్పనిసరి చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. మాతృభాషగా తెలుగు లేని పిల్లల కోసం గతంలోనే వెన్నెల పేరుతో సులభమైన తెలుగు వాచకాన్ని రూపొందించారు. రేవంత్‌ రెడ్డి సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయంపై తెలుగు భాషా ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.