UPSC CSE 2024 : సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఐఎఫ్ఎస్ హిమాన్షు త్యాగి గోల్డెన్ టిప్స్.. ఒత్తిడిని ఇలా డీల్ చేయండి!

UPSC CSE 2024 : సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలో ఐఎఫ్ఎస్ అధికారి అయిన హిమాన్షు త్యాగి తెలియజేస్తున్నారు.

UPSC CSE 2024 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీస్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా, ఈ 2024 ఏడాదిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష మే 26న జరుగనుంది. ప్రతి ఏడాదిలో యూపీఎస్సీ పరీక్షలో లక్షలాది మంది ఆశావహులు హాజరవుతారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో కొంతమంది మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్ తదుపరి ఇంటర్వ్యూలతో సహా అన్ని రౌండ్‌లను విజయవంతంగా పూర్తి చేస్తారు. చివరికి వారే ప్రభుత్వ అధికారులవుతారు.

Read Also : IAS Dikshita Joshi Success Story : యూపీఎస్సీ కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ అధికారిణిగా దీక్షిత్ జోషి..!

సివిల్స్ సాధించే ప్రయాణం అంత ఈజీ కాదనే విషయం అందరికి తెలిసిందే. ఎంతో కఠోర శ్రమ అవసరం.. కృషి పట్టుదల అన్ని కలగలిస్తేనే సివిల్స్‌లో సత్తా చాటగలరు. సివిల్స్ పరీక్ష కోసం సిద్ధమయ్యేవారిలో చాలామంది తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడిని అధిగమించడంలో విఫలమవుతుంటారు. కొందరు మాత్రమే సివిల్స్ ప్రయాణంలో ఒత్తిడిని అన్నింటిని అధిగమించి తమ గమ్యాన్ని చేరుకుంటారు. అలాంటి వారిలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు (IFS) అధికారి అయిన హిమాన్షు త్యాగి ఒకరు.

ఐఎఫ్ఎస్ హిమాన్షు త్యాగి గోల్డెన్ టిప్స్ ఇదిగో :
తన సివిల్స్ ప్రయాణంలో కూడా అడ్డంకులు ఉన్నప్పటికీ.. అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలిగారు. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ఔత్సాహికులతో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. సివిల్స్ పరీక్షలో విజయం సాధించడానికి ఉపయోగకరమైన చిట్కాలను పంచుకుంటున్నారు. ఇటీవలి తన పోస్ట్‌లో, హిమాన్షు త్యాగి ఆందోళన, భయం, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అద్భుతమైన చిట్కాలను షేర్ చేశారు. తన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఒత్తిడి లేకుండా ఉండటానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో తెలిపారు.

వర్తమానంపైనే దృష్టి పెట్టండి :
భవిష్యత్తు ఫలితాలు, పరీక్షలలో అడిగే ప్రశ్నల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రిపరేషన్‌పై సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం వర్తమానంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకానీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలన్నారు.

సానుకూల దృక్పథం :
అపజయాల పట్ల ఆందోళన చెందవద్దు.. ఫలితం ఏదైనా పాజిటివ్‌గా తీసుకోండి.. నెగటివ్ ఆలోచనలను వదిలేయండి. ప్రతి అంశాన్ని క్రమం తప్పకుండా రాసుకోండి. ప్రతి సానుకూల ఫలితానికి కృతజ్ఞతలు తెలపండి. మీ ప్రయాణంలో మీకు తోడుగా నిలిచిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేయండి. అదనంగా, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని ఆయన అన్నారు.

ధ్యానం చేయండి :
ఐఎఫ్ఎస్ త్యాగి ప్రకారం.. ప్రతిరోజూ ధ్యానం చేయడం తప్పనిసరి. శారీరక శ్రమ చేయాలన్నారు. ఆరోగ్యవంతమైన మనస్సుకు ఫిట్‌నెస్ చాలా కీలకమని సూచించారు. మనస్సు శాంతిగా ఉండాలన్నా మంచి మానసిక ఆరోగ్యం పొందాలన్నా ధ్యానం తప్పక చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రకృతి ఒడిలో సేద తీరండి :
యూపీఎస్సీ (CSE)కి ప్రిపేర్ అవ్వడం అంటే.. గంటల తరబడి గదిలో ఉండటమే కాదు. కాసేపు హాయిగా ప్రకృతి ఒడిలో సేద తీరండి. పచ్చని చెట్లను, పూలను చూస్తూ ఆహ్లాదంగా గడపండి. ఇలా చేస్తే మీలోని ఒత్తిడి, ఆందోళనల నుంచి సులభంగా బయటపడొచ్చునని త్యాగి సూచించారు.

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ట్రెండింగ్ వార్తలు