Assembly Electoins 2024: ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. ఒకే నియోజకవర్గంలో 6 మండల అధ్యక్షులు రాజీనామా
మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇప్పటి వరకు 41 స్థానాల్లో పేర్లను మాత్రమే ప్రకటించినా కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది.

Rajasthan Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీ క్రమంగా సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు టిక్కెట్ల పంపిణీలో బిజీగా ఉన్నాయి. అక్టోబరు 9న బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి 41 మంది పేర్లను ప్రకటించింది. భాజపా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో సంతోషం వెల్లివిరుస్తుండగా, కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది.
పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు రాజీనామా చేస్తున్నారు. సంచోర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీని బీజేపీ అభ్యర్థిగా చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంచోర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాల అధ్యక్షులు సామూహిక రాజీనామాలు చేసిన లేఖలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషికి అందజేశారు. ఎంపీకి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ కార్యకర్తలు నష్టపోయారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టిక్కెట్ల పంపిణీలో కార్యకర్తల మనోభావాలను విస్మరించారని కూడా అన్నారు.
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇప్పటి వరకు 41 స్థానాల్లో పేర్లను మాత్రమే ప్రకటించినా కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. సంచోర్‌లో బీజేపీకి రాజీనామా చేసిన మండల అధ్యక్షుల్లో పురేంద్ర వ్యాస్, సన్వాలారం దేవాసి, దుగ్రారామ్ జాట్, దేవేంద్ర సింగ్, జైసారం భిల్, మాధారం పురోహిత్ ఉన్నారు. గతంలో సంచోర్‌లో ఎంపీ దేవ్‌జీ పటేల్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఎంపీ కాన్వాయ్‌పై కూడా ప్రజలు దాడి చేశారు. ఇందులో ఆయన కారు కూడా దెబ్బతిన్నది.