New Year 2024: నేటితో మద్యం మానేద్దామనుకుంటున్నారా? ఇలా చేస్తే జీవితంలో మళ్లీ ముట్టుకోరు..
ఈ కాలంలో చాలా మంది స్కూలు పిల్లలు కూడా మద్యానికి, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. టీనేజ్‌లో అడుగుపెట్టే వారైతే..

Say no to alcohol
అసలే జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతుంటాయి. దానికి తోడు మద్యం అలవాటు చేసుకుని అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు కోట్లాది మంది. మద్యం తాగితే ఎన్నో అనర్థాలను కొని తెచ్చుకున్నట్లేనని అందరికీ తెలుసు. అన్నీ తెలిసి కూడా మద్యానికి దూరంగా ఉండలేరు.
ఈ కాలంలో చాలా మంది స్కూలు పిల్లలు కూడా మద్యానికి, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. టీనేజ్‌లో అడుగుపెట్టే వారికి మద్యం తాగాలన్న కోరిక బాగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కొంచం తాగితే ఏమీ కాదనుకుని మొదలు పెడతారు. ఆ కొంచం ఇంకొంచం పెరిగి తాగేవారందరినీ బానిసను చేసుకుంటుంది.
ఈ వ్యసనం ఊబిలోకి ఒక్కసారి దిగితే మళ్లీ దాని నుంచి బయట పడడం దాదాపు అసాధ్యంగానే చాలా మంది భావిస్తారు. చాలా మంది న్యూ ఇయర్ నుంచి మద్యం, సిగరెట్ వంటి అలవాట్లు మానేద్దామని అనుకుంటారు. మూడు-నాలుగు రోజులు మానేసి మళ్లీ మొదలు పెడుతుంటారు. మెదడు పనితీరును మార్చేస్తుంది మద్యం.
మీలో విచక్షణా జ్ఞానాన్ని తగ్గిస్తుంది. మీ శరీరంలోని ఒక్కో అవయవాన్ని దెబ్బతీస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుంది. బతికి ఉండగానే మరణాన్ని చూపిస్తుంది. అందుకే, న్యూ ఇయర్ నుంచే మద్యాన్ని మానేయండి.. ఈ చిట్కాలు పాటించి జీవితాంతం మళ్లీ ఆల్కహాల్‌ను ముట్టుకోకండి..
ఈ విషయాలు 2024 ఏడాది మొత్తం గుర్తుంచుకోండి.. మళ్లీ తాగరు
- 2023లో మీరు ఎంతగా తాగారో లెక్క వేసుకోవాలని న్యూ మెక్సికో విశ్వవిద్యాలయ మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్, రచయిత కేటీ విట్కీవిట్జ్ సూచిస్తున్నారు. ఒకేసారి పూర్తిగా మద్యం మానేయలేని వారు కొద్దికొద్దిగా మానేయవచ్చు. 2023లో నెలకు ఎంత తాగారో దానిలో 10 శాతం మాత్రమే మొదట తీసుకోండి. ఆ తర్వాత దాన్ని కూడా మానేయండి.
- మీరు తాగుడు మానేస్తున్నారని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హామీ ఇవ్వండి. ఒకవేళ మీకు తాగాలని అనిపిస్తే ఆ హామీ గుర్తుకు వచ్చి మద్యం తాగాలనిపించదు.
- వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయండి. వీటి వల్ల మీ మనసు కంట్రోల్లో ఉంటుంది. తాగాలని అనిపించినా దానికి దూరంగా ఉండే సామర్థ్యం వస్తుంది.
- మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. తాగుడు అలవాటు ఉన్నవారిని వారు తాగే సమయంలో కలవద్దు
- నీటిని అధికంగా తాగండి. దీని వల్ల కూడా తాగాలన్న కోరిక తగ్గుతుంది
- మీ ఇంట్లో మద్యం సీసాలవంటివి ఉంచుకోకండి
- ఒంటరిగా ఉండకండి.. దీని వల్ల మళ్లీ మద్యం తాగాలనిపిస్తుంది
- తాగుడు మానేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆన్‌లైన్‌లో పదే పదే చూస్తుండండి. అలాగే, తాగుడు వల్ల తలెత్తే సమస్యల గురించి తరుచూ తెలుసుకుంటూ ఉండండి
- మీ స్నేహితులు చేసుకునే పార్టీలకు దూరంగా ఉండండి
- మీకు మద్యం తాగాలనిపిస్తుందంటే మీరు దానికి బానిసగా మారుతున్నారని అర్థం. అటువంటి మానసిక బలహీనత మీకు లేదని మద్యానికి దూరంగా ఉంటూ మీకు మీరు నిరూపించుకోండి
- మద్యం మత్తులో సమాజంలో కొందరు పాల్పడుతున్న నేరాలు, దురాఘతాలను గురించి తెలుసుకోండి. మీరు అటువంటి వారిగా మారకూడదని అనుకుంటూ ఉండండి
- ఈ పైవన్నీ పాటించినా మద్యాన్ని మానలేకపోతోంటే వైద్యులను సంప్రదించి శాస్త్రీయ పద్ధతుల్లోనూ దానికి దూరంగా ఉండేలా ప్రయత్నాలు చేయొచ్చు. అంతేగానీ, మద్యానికి దూరంగా ఉండాలన్న మీ నిర్ణయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మార్చుకోవద్దనే దృఢ నిశ్చయంతో ఉండండి
Police Rules : దొరికితే.. 6నెలలు జైలు, రూ.10వేలు ఫైన్.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల కొత్త రూల్స్