ICMR Guidelines : దేశంలో 56శాతం రోగాలకు ఆహారమే కారణం.. ఎంత తినాలంటే? : ఐసీఎమ్ఆర్ సూచనలు

ICMR Guidelines : పంచదార, ఉప్పు పరిమితి మేరకే.. ఆహారంలో భాగం కావాలని హెచ్చరించింది. అలాగే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనీ ICMR తెలిపింది.

ICMR Guidelines : ICMR స్వయంగా వెల్లడించిన విషయం. అందుకే ఏ ఆహారం ఎంతెతంత మొత్తంలో తీసుకోవాలో ICMR సూచనలు చేసింది. దేశంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంచడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, తృణధాన్యాలు, పప్పు, పెరుగు వంటివాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని కోరింది. సమతుల్య ఆహారం కోసం అనేక రకాల పదార్థాలను తీసుకోవాలని సూచించింది. పంచదార, ఉప్పు పరిమితి మేరకే.. ఆహారంలో భాగం కావాలని హెచ్చరించింది. అలాగే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనీ ICMR తెలిపింది.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

ఆహారంలో 45శాతం మించకూడదు : 
కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర ఉంటే.. ఆరోగ్యంగా ఉంటామని అందరం భావిస్తాం. అయితే నిద్ర సంగతి పక్కనపెడితే..కడుపునిండా తినే తిండి ఇష్టానుసారంలా లేకుండా.. అన్నిరకాలు పోషకాలు, లవణాలు శరీరానికి అందేలా ఉంటేనే ఆరోగ్యవంతులవుతాం. దేశమంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ICMR ఆహారపు అలవాట్లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 8 రకాల ఆహారపదార్థాలను సూచించిన ICMR వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని కోరింది. తృణధాన్యాలు ఎంత ఎక్కువ తింటే అంతమంచిదని మనం అనుకుంటాం. కానీ నిజానికి తృణధాన్యాలు మొత్తం ఆహారంలో 45శాతాన్ని మించకూడదు. కానీ ఇప్పుడు మన ఆహారంలో వాటి భాగం 50 నుంచి 70 శాతం ఉంటోంది.

ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచిది : 
ICMR లెక్కల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం అంటే సరిపడా కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, పప్పులు, నట్స్, పండ్లు, పెరుగు, తక్కువమొత్తంలో నూనె, రుచికి సరిపడా కాస్త ఉప్పు. రోజుకు 2వేల కేలరీలు శరీరానికి అందాలంటే 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వందగ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పులు లేదా కోడిగుడ్లు, 35 గ్రాముల గింజలు, 27గ్రాముల నూనె తీసుకోవాలి. అన్నం, ఓ కూర, పప్పు, పెరుగు.. వంటవి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోకూడదని…అనేక రకాలను రోజూ తినడం వల్ల మాత్రమే శరీరానికి పోషకాలు అందుతాయని ICMR తెలిపింది. కూరగాయలు, పళ్లు, ఆకుకూరలను రోజూ తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రస్తుతం పెద్దసంఖ్యలో ప్రజలు అలవాటుపడుతున్న ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరించింది.

శరీరానికి సరిపడా ప్రొటీన్లు అందే ఆహారం తీసుకుని…తగినంత వ్యాయామం చేయడం ద్వారా శక్తి వస్తుందని, కండరాలు పటిష్టంగా మారతాయని తెలిపింది. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలికరోగాలు, ఊబకాయం, రక్తహీనత, నీరసం వంటివి రాకుండా ఉండేందుకూ ఆహారపరంగా తీసుకునే జాగ్రత్తలు ఎంతో మేలుచేస్తాయని వెల్లడించింది. ఆహారంలో ఉప్పు, పంచదార ఎక్కువగా తీసుకోవద్దని ICMR హెచ్చరించింది. ఉప్పు, పంచదార ఎక్కువ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు, హైపర్ టెన్షన్ డయాబెటిస్ వంటివాటిబారిన పడే ప్రమాదముందని తెలిపింది. ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలని, పోషకాహార లోపం ఉండకూడదని సూచించింది. వండేముందు ఆహారపదార్థాలు శుభ్రం చేయడం, పదార్థాలను పూర్తిస్థాయిలో ఉడికించడంలో నిర్లక్ష్యం వద్దని తెలిపింది. మంచి ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో నీరు తాగడం తప్పనిసరని తెలిపింది. టీ, కాఫీలు, కొబ్బరి బోండాలు వంటివాటిగురించి కీలక సూచనలు చేసింది ICMR. టీ, కాఫీలు పరిమితంగా తాగాలని సూచించింది. భోజనానికి గంట ముందు, గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు తాగొద్దని హెచ్చరించింది. ఇది పాటించకపోతే కోరి రోగాలను తెచ్చుకోవడమేనని తెలిపింది. ఇలా తాగొద్దనడానికి గల కారణాలనూ వివరించింది.

కెఫీన్‌తో మెదడుపై ప్రభావం : 
కాఫీ, టీల్లోని కెఫీన్ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇవి తాగిన వెంటనే ఉత్సాహంగా అనిపిస్తాయి. కాఫీ, టీలు మానలేని అలవాటుగా మారడానికీ ఇదే కారణం. అలాగే వీటిలో పాలీఫినాల్స్, టానిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. భోజనానికి గంట ముందూ, తర్వాతా ఇవి తీసుకుంటే ఈ రసాయనాలు భోజనంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. ఐరన్ లోపించడం వల్ల నీరసం, ఆయాసం, గుండెదడ, తలనొప్పి, చర్మం పాలిపోయినవిధంగా మారడం వంటి అనేక రకాలు సమస్యలుంటాయి. అందుకే కాఫీ, టీలను సమయం, సందర్భం లేకుండా తీసుకోకూడదు. అలాగే రోజుకు 300 మిల్లీగ్రాములకు మించి కెఫీన్ తీసుకోకూడదు. ఒక కప్పు కాఫీలో గరిష్టంగా 120 మిల్లీగ్రాముల కెఫీన్, ఒక కప్పు టీలో గరిష్టంగా 35 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. కాబట్టి…రోజుకు రెండు సార్లు కన్నా కాఫీ, టటీలు తాగడం మంచిది కాదు. అలాగే పాలు లేని టీ, కాఫీలతో అనేక ప్రయోజనాలున్నాయి. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ పరిమితంగా తీసుకుంటే గుండె సమస్యలకు, పొట్ట క్యాన్సర్ వంటి రోగాలకు ఉపశమనంలా పనిచేస్తుంది.

పొటాషియం, కాల్షియం అందించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లను నేరుగా తినడం మంచిది. షుగర్ కంటెంట్ దృష్ట్యా చెరుకురసం మితిమీరి తాగకూడదు. అలాగే కొబ్బరి నీళ్ల విషయంలోనూ గట్టి హెచ్చరికలు చేసింది ICMR. కొబ్బరినీళ్లు మంచిదని ఇష్టానుసారం తాగకూడదని, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండడమే మంచిదని తెలిపింది. మొత్తంగా ఏమి తినాలి..ఎలా తినాలి.. ఎప్పుడు తినాలి వంటివాటిని జాగ్రత్తగా పాటించడం ద్వారా అనారోగ్యానికి, ఆస్పత్ర్రులకు దూరంగా ఉండవచ్చని చెబుతూ ICMR ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది.

Read Also : ICMR Guidelines : ఆహార అలవాట్లపై ICMR మార్గదర్శకాలు.. ఎప్పుడు.. ఎలా? ఏమి తినాలి?

ట్రెండింగ్ వార్తలు