రష్యా కోవిడ్ వ్యాక్సిన్ సమాచారం కోరిన భారత్.. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులపై చర్చలు!

  • Published By: sreehari ,Published On : August 15, 2020 / 07:02 PM IST
రష్యా కోవిడ్ వ్యాక్సిన్ సమాచారం కోరిన భారత్.. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులపై చర్చలు!

Updated On : August 15, 2020 / 7:17 PM IST

కోవిడ్ వ్యాప్తితో ప్రపంచమంతా వణికిపోతోంది. ప్రపంచానికి మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో రెడీ చేశామంటూ రష్యా ప్రకటించుకుంది. రెండు దశల ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయని.. అతి త్వరలో మూడో దశ ట్రయల్స్ మొదలు కానుందని చెబుతోంది.

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలైందని, ఆగస్టు ఆఖరులోగా కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా హమీ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ఎలా సాధ్యమనేదానిపై ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.



రష్యా కరోనా వ్యాక్సిన్ కోసం ఎలాంటి టెక్నాలజీని వాడాయో తెలుసుకోవాలనే ఆలోచన మొదలైంది.. ఇతర దేశాల మాదిరిగానే.. భారతీయ కంపెనీలు కూడా ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన సాంకేతిక సమాచారం కోరాయి.. ఇదే విషయాన్ని ఆ దేశ మీడియా స్పుత్నిక్ వెల్లడించింది. వ్యాక్సిన్ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా భారతీయ కంపెనీలు రష్యా అనుమతి కోరినట్లు తెలిపింది. దీనిపై రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF)తో చర్చించినట్లు వెల్లడించింది.



స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 సాంకేతిక వివరాలను RDIFను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతులు ఇచ్చిన అనంతరం దేశీయంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు ఎగుమతి చేయడంపై అనుమతి కోరాయని స్పుత్నిక్ పేర్కొంది. మాస్కోలోని రాయబార కార్యాలయ వర్గాలే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాయని తెలిపింది.



మాస్కోలోని భారత రాయబారి వెంకటేశ్ వర్మ స్పుత్నిక్-విపై RDIF సీఈవో Kirill Dmitrievతో చర్చించారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్ డోస్ల వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్ చేశాయని దిమిత్రియేవ్ తెలిపారు. కొవిడ్-19 పై వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఇరుదేశాల మధ్య చర్చలు విజయవంత మయ్యాయని నివేదిక వెల్లడించింది.