కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ సమయం నిద్రపోతున్నారా? అయితే మీ నిద్రలో నాణ్యత ఉందా? ఎక్కువ గంటలు నిద్రపోయినంత మాత్రాన కంటినిండా నిద్ర పోయినట్టు కాదంటోంది ఓ సర్వే. మీరు నిద్రపోయే గంటలు ఎక్కువ అయినా అందులో నాణ్యత తక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది.
లాక్ డౌన్‌లో నిద్ర ఎలా మారిందో స్విట్జర్లాండ్‌లోని బాసెల్ యూనివర్శిటీ, యూనివర్శిటీ మానసిక ఆస్పత్రిలో నిర్వహించిన ఒక సర్వే పరిశోధించింది. పరిశోధకులు 435 మందిలో నిద్ర నాణ్యతపై సర్వే చేశారు. నిద్ర నాణ్యత క్షీణించగా.. వారంతా ఎక్కువసేపు నిద్రపోతున్నట్లు నివేదించింది. ఈ అధ్యయనం కరెంట్ బయాలజీ పత్రికలో ప్రచురించారు.
మార్చి 23, ఏప్రిల్ 26 మధ్య పరిశోధకులు 6 వారాల ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు. 435 మంది (వారిలో 75శాతం మహిళలు) స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీలలో సర్వే చేశారు. ఆ సమయంలో 85శాతం కంటే ఎక్కువ మంది ఇంటి నుంచి పని చేస్తున్నట్టుగా తేలింది. పని, విశ్రాంతి చక్రం తరచుగా మన అంతర్గత జీవ గడియారంతో సరిపోలడం లేదని గుర్తించారు.
నిద్ర సమయం, పని దినాలు, సెలవుల మధ్య వ్యత్యాసాలు చాలా పెద్దవిగా ఉండటంతో ‘social jetlag’కు దారితీస్తుందని తేల్చేశారు. మరింత సౌకర్యవంతమైన పని గంటలతో సోషల్ జెట్‌లాగ్‌లో నిద్ర నాణ్యత తగ్గేందుకు దారితీసిందని సర్వే చివరికి తేల్చేసింది. సర్వే చేసిన వారి స్లీప్-వేక్ శాంపిల్స్, సోషల్ రిథమ్స్ కంటే అంతర్గత జీవ సంకేతాల ద్వారా మార్గనిర్దేశం చేయడం జరుగుతోందని పరిశోధకులు భావిస్తున్నారు.